తెలంగాణ అసెంబ్లీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీకి పునర్ వైభవం తీసుకురావడం దిశగా తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం పార్టీ ఉన్న స్థితిగతుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం అంత సులువు కాదు. ఆస్పృహను మదిలో ఉంచుకుని ముందు పార్టీకి జవసత్వాలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఎన్నికలను వాడుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న సూచన చాలా విలువైనదిగా కనిపిస్తోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం వ్యూహం గురించి చంద్రబాబు నాయుడు ఓ సంగతి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇప్పటికే సమయం మించిపోయిందని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మాత్రమే పోటీ చేస్తుందని, పార్టీకి కొంత బలం ఉన్న పరిమిత స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలా? లేదా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను బరిలోకి దిగాలా? అనే విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల వ్యూహరచన కమిటీ నిర్ణయిస్తుందని ఆయన ప్రకటించారు.
అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి, ఆ కమిటీకి చంద్రబాబు నాయుడు చేసిన సూచన భిన్నంగా ఉంది. పార్టీకి ఎంతో కొంత బలం ఉన్న కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేయాలని, రాష్ట్రంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ నియోజకవర్గాలకు తరలివెళ్లి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారట. మొత్తం స్థానాలలో పోటీ చేసి నాయకుల కృషి డైల్యూట్ కావడం కంటే.. కొన్ని స్థానాల మీద అందరూ దృష్టి పెట్టడం వలన అంతో ఇంతో లాభం ఉంటుందని అన్నారట. ముందు కొన్ని సీట్లు అయినా గెలిచి శాసనసభలో అడుగుపెడితే ప్రజల పక్షాన నిలిచి నిరంతర పోరాటాలు చేయడం ద్వారా ముందు ముందు పార్టీకి మరింత వైభవ స్థితి తీసుకురావచ్చని చంద్రబాబు నాయుడు వారికి మార్గదర్శనం చేసినట్లుగా తెలుస్తోంది. మరి రాష్ట్ర కమిటీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ వ్యూహంతో ముందుకు వెళతారో వేచి చూడాలి.