దగుబాటి వెంకటకృష్ణారెడ్డిని అందరూ ‘కావ్య కృష్ణారెడ్డి’ అని పిలుస్తారు. ఆయన నెల్లూరు కేంద్రంగా.. ప్రధానంగా కంకర క్వారీల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. గత ఎన్నికల సమయంలోనే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ, పార్టీ విజయం సాధించడానికి చాలా కష్టపడి పనిచేశారు. కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఆయనకు రాజకీయ ఆసక్తి కూడా ఉంది. తాను మద్దతిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అంతర్గత రాజకీయాలలో తనకు అవకాశం ఉంటుందో లేదో అని సందేహించారో ఏమో గాని, ఆయన చూపు తెలుగుదేశం పార్టీ మీద పడింది. ఆ పార్టీ వైపు మొగ్గారు. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీచేయాలనే ఉద్దేశంతో, ఆ పార్టీ వారితో సన్నిహితంగా మెలుగుతున్నారు . ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పార్టీకి కోటి రూపాయల విరాళం కూడా ఇచ్చారు.
అంతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆయన మీద ఆగ్రహం కలిగింది. ఇన్నాళ్లుగా తమ పార్టీకి ఆయన అన్ని రకాలుగా అందించిన సేవలను కూడా ఆ కోపంలో మరిచిపోయారు. తెలుగుదేశం పంచన చేరాలని అనుకుంటున్నందుకు తగిన బుద్ధి చెప్పాలని ఆలోచించారు. ఆయన చేస్తున్నది ప్రధానంగా మైనింగ్ వ్యాపారం కనుక.. తనిఖీల నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తీర్మానించి ఏకంగా 142 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతుంది. తమ పార్టీలో ఉన్నంతవరకు ఆయన వ్యాపారాల పట్ల ఉపేక్ష ధోరణి వహించి.. తెలుగుదేశం వైపు చూపు సారించగానే ఆయన మీద కత్తి దూస్తున్న ప్రభుత్వ వైఖరిని పలువురు తప్పుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతిపరులు మద్దతుదారులు కార్యకర్తలు అందరినీ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని, వారిని ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని తొలినుంచి ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి! తెలుగుదేశం వారి ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం రకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. అలా కుదరకపోతే నిబంధనల అతిక్రమణల పేరిట వారి ఆస్తులను కూల్చివేయడం ద్వారా అయినా ఒక సంతృప్తిని పొందుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలను కూడా వేధిస్తుండడం అనేది.. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తున్నదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం దూకుడు మాత్రం తగ్గడం లేదు. కృష్ణారెడ్డికి ఏకంగా 142 కోట్ల రూపాయల జరిమానాలతో.. తెలుగుదేశం వైపు చూసినందుకు వేసిన జరిమానా సంచలనం రేకెత్తించేదే. ఇలాంటి పరిణామాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే గనుక ప్రభుత్వపు ద్వేషపూరిత రాజకీయాల పట్ల విరక్తి చెందుతారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.