అచ్చంగా ఇవి కప్పల తక్కెడ రాజకీయాలే!

Sunday, December 22, 2024

తక్కెడలో (త్రాసులో) రెండువైపులా కొన్న కప్పలను పెట్టి తక్కెడఎటువైపు మొగ్గుతుందో తేల్చి చెప్పడం ఎలాగ? అందులో ఉన్న కప్పలు కుదురుగా బెల్లం ముద్దలా ఎందుకు కూర్చుని ఉంటాయి. కప్ప అన్నాక అది ఇటునుంచి అటుకు అటునుంచి ఇటుకు ఎగురుతూనే ఉంటుంది. తక్కెడ క్షణక్షణానికి మొగ్గు అటుఇటూ మారిపోతూనే ఉంటుంది. అందుకే ఫిరాయింపు రాజకీయాలను పెద్దలు కప్పల తక్కెడ రాజకీయాలతో పోలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్న తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య జోరుగా సాగుతున్న ఫిరాయింపులు.. అచ్చంగా కప్పల తక్కెడ సామెతను గుర్తుకు తెస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో భారాస పక్కన పెట్టిన కీలక నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ కాలం నానా హడావుడి చేసిన తర్వాత కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారాస తనను బహిష్కరించిన తర్వాత, అంతకు ముందు కూడా.. కేసీఆర్ మీద విపరీతంగా విమర్శలు చేస్తూ వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాజపా, కాంగ్రెసులతో సుదీర్ఘంగా మంతనాలు సాగించి.. చివరికి తన మాట నెగ్గే అవకాశమూ, తను చెప్పిన వారందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అవకాశమూ తరచి చూసుకుని.. చివరికి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీ వెళ్లి బేరం కుదర్చుకుని వచ్చి, ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులైన అనేక మంది నాయకులు కూడా భారాస నుంచి కాంగ్రెసులో చేరారు. అయితే.. కాంగ్రెసు పార్టీ మీదనే నమ్మకం పోయిందో, లేదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీలో దక్కగల ప్రాధాన్యం గురించి, ఆయన మాట చెల్లుబాటు కాగల అవకాశం గురించి అనుమానాలు పుట్టాయో తెలియదు గానీ.. ఆయన కీలక అనుచరులు అప్పుడే వెనక్కి మళ్లుతున్నారు. కప్పల తక్కెడ సామెత గుర్తుకు వచ్చేలాగా తిరిగి భారాసలోకి వెళ్లిపోతున్నారు.

తన అనుచరులందరికీ కూడా తాను చెప్పినట్లుగా టికెట్లు ఇవ్వాలనేది పొంగులేటి కండిషన్ గా ఆయన పార్టీలో చేరకముందు ప్రచారం జరిగింది. ఆయన చేరిక తర్వాత.. ఆ కండిషన్ కు పార్టీ ఒప్పుకున్నట్టే అంతా అనుకున్నారు. ఆ క్రమంలోనే భారాస తరఫున 2018లో భద్రాచలం నుంచి ఓడిపోయిన పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెసులో చేరారు. కానీ, ఆ పార్టీలో ఆయనకు అంతగా సానుకూల వాతావరణం కనిపించినట్టు లేదు. ఎందుకంటే.. భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెసు నాయకుడు పొడెం వీరయ్య ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెసు పార్టీ పట్ల విశ్వాసంతో కొనసాగుతున్న సిటింగ్ ఎమ్మెల్యేలే అతి తక్కువమంది కాగా.. వారికి కూడా టికెట్లు నిరాకరించడం అనేది ప్రజల్లోకి పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని అధిష్ఠానం భావించింది. దీంతో భద్రాచలం టికెట్ తనకు దక్కదని భావించిన తెల్లం వెంకటరావు.. తిరిగి భారాసలో చేరబోతున్నట్టుగా ప్రకటించేశారు. ఆ పార్టీలో కూడా టికెట్ గ్యారంటీ హామీ తీసుకున్న తర్వాతనే ఆయన చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అటు గెంతడం, ఇటు గెంతడంతో తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles