జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి అయి ఉండవచ్చు గాక.. ఇతర రాష్ట్రాల్లో ఆయన అస్తిత్వం ఏమిటి? ఏ వైఎస్సార్ పేరు మీద అయితే పార్టీని చెలామణీలోకి తీసుకువచ్చారో.. ఆ వైఎస్సార్ ను దేవుడిగా భావించిన ప్రజలుండే ప్రాంతాల్లో అయినా పార్టీకి ఉనికి ఉన్నదా? తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రాల్లో అయినా పార్టీని కాపాడుకోవాలని ఉండదా? అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఆయన పార్టీకి ఇక్కడ తప్ప మరెక్కడా ఠికానా లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరిగి కొంత ఆదరణ కనిపిస్తుండే సరికి.. జగన్మోహన్ర రెడ్డి ఓర్వలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేసింది. తెలంగాణలో ఆ పార్టీకి చాలా ఘోరమైన పరాభవం ఎదురైంది. తెలుగుదేశం పరిస్థితి పరవాలేదు గానీ.. గెలిచిన వారందరినీ కేసీఆర్ ప్రలోభపెట్టి తన పార్టీలో కలిపేసుకున్నారు. ఆ పరాభవభారానికి అక్కడ బిచాణా ఎత్తేసి పూర్తిగా ఏపీలోనే సర్దుకున్నారు జగన్. గెలిచిన వాళ్లు వంచిండంతో టీడీపీ దెబ్బతింది. ఇన్నేళ్ల విరామం తర్వాత.. ఇప్పుడు మళ్లీ బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఖమ్మంలో సభ పెడితే సూపర్ సక్సెస్ అయింది. దాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు. తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ బలపడుతున్నదంటే.. ఆయన సహించలేకపోతున్నాడు. త్వరలో మరిన్ని సభలతో తెలుగుదేశం అక్కడ విస్తరించబోతున్నదంటే.. ఆయనకు తన చేతగానితనం గుర్తుకు వస్తోంది. తన మీద తనకే జాలి కలుగుతోంది. దాన్ని కప్పెట్టుకోవడానికి.. చంద్రబాబు మీద సూటిపోటి దెప్పిపొడుపు మాటలు వదులుతున్నాడు. ఆయనకు ఈరాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం అంటున్నాడు. అలా చంద్రబాబును డిఫెన్సులో పడేయగలనని అనుకుంటున్నారు. ఇవన్నీ చేతగాని మాటలు అని జనం నవ్వుకుంటున్నారు.
టింగుమంటే.. ఆయనకు ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఇంకో ప్రజలు అంటూ నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తనకు ఇదొక్కటే రాష్ట్రం అని.. తాను ఇక్కడే ఉంటానని చంటిగాడి లెవెల్లో పంచ్ డైలాగులు వల్లిస్తుంటారు. మరి వైఎస్సార్ కాంగ్రెస్ ను జాతీయ పార్టీ అని ఎందుకు ప్రకటించుకుంటున్నారు. పార్టీకి జాతీయ కార్యవర్గం ఏర్పాటుచేసుకుని ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డిని పెట్టి.. ఏం సంకేతాలు ఇస్తున్నారు. ముచ్చటగా ముందు తమది ప్రాంతీయ పార్టీ మాత్రమే అని ప్రకటించుకుని, ఆ మేరకు ఢిల్లీలో దందాలకు పార్టీ హోదాను వాడుకునే విజయసాయిరెడ్డి పదవులను కూడా మార్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులను ప్రజలు నమ్ముతారు.