మీడియా ముందుకు రావడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదని అందరికీ తెలుసు. పేరుకు ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ.. సకల శాఖల మంత్రిగా విపక్షాలు మెండుగా అభివర్ణించే సజ్జల రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి మనసులోని మాటలను తనవిగా తరచుగా మీడియా ముందు బయటపెడుతూ ఉంటారు అనే సంగతి కూడా ప్రజలకు తెలుసు. అలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసిపోయే అవకాశం ఉన్నదని సజ్జల అన్న మాటలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ నాయకులు ఈ వ్యాఖ్యలను తమకు తోచిన రీతిలో ఖండిస్తూ పోతున్నారు. ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తిరిగి కలవడం అనేది జరిగే పని కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు అధికార స్వరం అయిన సజ్జల ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో గానీ.. ఇప్పుడదే నవ్వులపాలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా యాత్రలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఆ వ్యాఖ్యలపై వేసిన సెటైర్లు పేలిపోయేలా ఉన్నాయి.
ఏపీలో ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎడాపెడా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. ఇక దోచుకోడానికి ఇక్కడేమీ మిగలక మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసిపోవాలని కోరుకుంటున్నారని చంద్రబాబునాయుడు విమర్శలు సంధించారు. అందుకు ఆయన అంబానీ ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు.
‘రిలయన్స్ అంబానీకి ఇద్దరు కుమారులు. వీరికి సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు. ముఖేష్ పైపైకి వెళ్లారు. అనిల్ కిందకు వెళ్లారు. ఇప్పుడు ఆయన వచ్చి నేను నీతో కలుస్తా అంటే ముఖేష్ ఒప్పుకుంటారా? మీ అన్నో తమ్ముడో దివాలా తీసి మళ్లీ నీతో కలుస్తా.. అంటే మీ కుటుంబం అంగీకరిస్తుందా?’’ అని చంద్రబాబునాయుడు ఉదాహరణ చెప్పారు.
తెలుగురాష్ట్రాలు విడిపోయినప్పటినుంచి కూడా.. సోదరుల్లా కలిసి మెలగాలి.. అంటూ సోదరుల ప్రస్తావన పదేపదే అందరూ చెబుతుంటారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయి అనే సజ్జల మాటలకు కౌంటర్ గా చంద్రబాబునాయుడు అద్భుతమైన ఎగ్జాంపుల్ తో వైసీపీ శ్రేణుల నోరుమూయించారని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పిన అంబానీ ఎగ్జాంపుల్ అతికినట్టుగా సరిపోతుందని.. అనిల్ లాగా ఆస్తులన్నీ నాశనం చేసేసుకుని.. ఇప్పుడు కలిసిపోవడం గురించి జగన్ కోటరీ చిలక పలుకులు పలుకుతున్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు.