మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఆయన చుట్టూ అనేక అనేక అవినీతి ఆరోపణలు, మహిళల పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. అలాగని నియోజకవర్గంలో ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. జగన్ వద్ద హవా తగ్గిపోయింది. మంత్రి పదవి ఉంటుందో పోతుందో అనిపించేంత పరిస్థితి. ఏదో డాంబికంగా ప్రతిరోజూ మీడియాముందుకు వస్తూ చంద్రబాబు నాయుడు మీద నిందలు వెదజల్లుతుంటారు గానీ.. పార్టీ ఆయనను తగినవిధంగా గౌరవిస్తోందన్న నమ్మకం మాత్రం లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉండగా.. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి.. ఆయన ఎమ్మెల్యే టికెట్ కే ఎసరు పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ ఆ వర్గాన్ని తొక్కేసి.. టికెట్ పుచ్చుకున్నా కూడా.. అసమ్మతి వర్గం రాబోయే ఎన్నికల్లో ఆయనకు సినిమా చూపించడం గ్యారంటీ అని స్థానికంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు గడ్డు రోజులు తప్పేలా లేదు. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నాయకుల్లో ఒకరైన చిట్టా విజయభాస్కర్ రెడ్డి ప్రకటించేసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలనుంచి పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించి ఓ ఆత్మీయసమావేశం కూడా పెట్టుకున్నారు. అంబటి మీద విమర్శలు సరే సరి. ఈ సమావేశానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారంటూ నిందలు కూడా వేశారు. సత్తెనపల్లి పార్టీ టికెట్ విషయంలో పార్టీలో యుద్ధం చేసి అయినా సాధించుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. తను నిర్వహించిన సమావేశానికి వచ్చిన వాళ్లను ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తే గనుక.. రోడ్డెక్కుతానని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ చిట్టా విజయభాస్కరరెడ్డి తీరు చూస్తే.. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా లేదు, పార్టీని- జగన్ ని బెదిరిస్తున్నట్టుగా ఉంది. నాకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని ఓడించి తీరుతా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా ఇలాంటి తిరుగుబాటు వైఖరులను సహించే అలవాటులేని జగన్ ఎలా స్పందిస్తా రో తెలియదు. అంబటిని పక్కన పెట్టడానికి ఆల్రెడీ నిర్ణయించుకుని ఉంటే గనుక.. పట్టించుకోకపోవచ్చు. అలా కాకపోతే.. చిట్టా మీదనే వేటు వేయవచ్చు.
తెలుగుదేశం తరఫున సత్తెనపల్లి నుంచి బలమైన అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో సొంత పార్టీలో అసమ్మతి రూపంలో అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో దబిడి దిబిడే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అంబటికి ఈ ఎన్నికల్లో దబిడిదిబిడేనా?
Wednesday, January 22, 2025