ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు ముద్ర ఉన్నదనే అభిప్రాయంతో అమరావతి నగరాన్ని మాత్రమే శిథిలయం చేయడానికి కంకణం కట్టుకున్నారేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రజావేదిక దగ్గరినుంచి అనేకానేక కూల్చివేతలను గమనిస్తున్నప్పుడు.. చంద్రబాబు చేసిన పనుల ఆనవాళ్లే లేకుండా చేయాలని జగన్ అనుకుంటున్నారేమో అని భావిస్తారు. అయితే తాజాగా గమనిస్తోంటే చంద్రబాబునాయుడు ఎంతో శ్రద్ధతో చేయిస్తూ వచ్చిన పోలవరం ప్రాజెక్టును కూడా శిథిలం చేయడానికే కంకణం కట్టుకున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే… పోలవరం పనులను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లను పిలిపించి వారిని పనులు ఆపేయాల్సిందిగా చెప్పారు. తెదేపా సర్కారు కేటాయించిన టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి డబ్బు ఆదా చేయబోతున్నానని అంటూ.. సుదీర్ఘకాలం కాలయాపన తర్వాత.. రివర్స్ టెండరింగ్ లో తనకు ఆప్తులైన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు కట్టబెట్టారు. డబ్బు మిగలబెట్టినట్టు లెక్క చెప్పారు.
కానీ ఆ తర్వాత పనులు జరుగుతున్న కొద్దీ అంచనాలను రివైజ్ చేస్తూ వందల వేల కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం పెరిగేందుకు కూడా కారణం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనదాయని అని అందరూ అంటూఉంటారు. దానిని పణంగా పెట్టి.. పోలవరం అంటే నాయకులకు ఆదాయ ప్రదాయని అన్నట్టుగా దానిని మార్చేశారు.
సరే.. ఎవరికి తోచినట్లుగా వాళ్లు పోలవరం ప్రాజెక్టును స్వార్థానికి, సంపాదనకు వాడుకుంటున్నారని సరిపెట్టుకున్నప్పటికీ.. కనీసం నాణ్యంగా పనులు కూడా చేయించకపోతే ఎలాగ? పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మంగళవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన రావడానికి ముందుగానే.. పోలవరం స్పిల్ వే కు ఎగువన నిర్మించిన గైడ్ బండ్ పగుళ్లు వచ్చి కుంగిపోయింది. గైడ్ బండ్ లో నిర్మించిన కట్ట, అందులోని రాళ్లు దిగువకు జారిపోయాయి. రిటైనింగ్ వాల్ కూడా కుంగిపోయింది. కటాఫ్ సరిగా లేకపోవడం వల్లనే గైడ్ బండ్ కుంగిపోయి ఉంటుందని ఇంజినీర్లు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని పోలవరం అథారిటీ కి కూడా తెలియజేశారు. శుక్ర శనివారాల్లోనే పగుళ్లు రాగా, ఆదివారానికి అది పూర్తిగా కుంగిపోయింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ వారే ఈ పనులను కూడా చేపట్టడం గమనార్హం.
జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పట్ల కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఆయన ఎంతగా చెప్పుకుంటున్నప్పటికీ.. కనీసం రెండేళ్ల కిందట పూర్తయి ఉండాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా నాలుగేళ్లయినా పూర్తికాలేని పరిస్థితి ఉంది. పైగా తనకు అయిన వారికి కాంట్రాక్టులను కట్టబెట్టి.. నాణ్యతకు కూడా తిలోదకాలు ఇస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ద్రోహం చేస్తే అది యావత్ రాష్ట్రానికి ద్రోహం అవుతుందని అంటున్నారు. ఈ పనుల లోపాలతో జగన్ క్రెడిబిలిటీ ఏమైనా ఉంటే మొత్తం మంటగలిసిపోతుందని కూడా అనుకుంటున్నారు.
‘అంతన్నా డింతన్నాడే ..’ జగన్ క్రెడిబిలిటీ గోవిందా!
Monday, December 23, 2024