టాలీవుడ్‌లో తమిళ డబ్బింగ్ సినిమాలకు ఎప్పటినుంచో మంచి మార్కెట్ ఉంది. కానీ ఇటీవలి కాలంలో అక్కడి టాప్ హీరోలు, పేరున్న దర్శకులు తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఒక్కోసారి పెద్ద ఆశలతో వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఫలితం నిరాశ కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన కొత్త సినిమా మదరాసి మీద పడింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఒకప్పుడు మురుగదాస్ చేసిన సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి రెస్పాన్స్ ఉండేది. కానీ ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలు మాత్రం కలిసిరాలేదు. అందుకే ఈ సారి ఆయన సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానం ప్రేక్షకుల్లో ఉంది.
ఇక సమస్య కేవలం మురుగదాస్ దగ్గర మాత్రమే కాదు. ఇతర పెద్ద తమిళ దర్శకులు తీసిన సినిమాలు కూడా వరుసగా ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్, మణిరత్నం తీసిన థగ్ లైఫ్ తెలుగు ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేదు. లోకేశ్ కనగరాజ్ రూపొందించిన కూలీ కూడా కొంతవరకే వర్కవుట్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ తీసిన మదరాసి ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాల్సిందే మరి.
