బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడు ఓటీటీ పద్ధతులపై సీరియస్‌గా స్పందించారు. సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలో పెట్టడం వల్ల థియేటర్లకు నష్టం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే ఆసక్తి కోల్పోతారని, ఇది సినిమా రంగానికి మేలు చేసే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల తన సొంత బ్యానర్‌లో రూపొందుతున్న “సితారే జమీన్ పర్” సినిమా ప్రమోషన్ సందర్భంగా అమీర్ ఈ విషయాలు వెల్లడించారు. తారే జమీన్ పర్ సినిమాతో ఎన్నో మనసులను గెలుచుకున్న అమీర్, మళ్లీ అలాంటి భావోద్వేగాన్ని కలిగించే కథతో వస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించినవారు ఆర్‌ఎస్ ప్రసన్న కాగా, నిర్మాణ బాధ్యతలు కూడా అమీర్ ఖానే చేపట్టారు. అంతేకాదు, ఇందులో అమీర్ నటిస్తూ కూడా కనిపించనుండటం వలన ఈ సినిమా మీద అంచనాలు బాగానే పెరిగాయి.
ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే, ఇప్పటివరకు ఎవరితోనూ ఒప్పందం కుదరలేదు. సినిమా థియేటర్స్‌లో ప్రదర్శన ముగిసిన తర్వాత, దీన్ని తన యూట్యూబ్ చానల్ ద్వారా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేస్తానని అమీర్ చెబుతున్నారు. అంటే, ప్రేక్షకులు డబ్బులు చెల్లించి సినిమాను ఆన్‌లైన్‌లో చూడాలి.
ఇక ఈ నిర్ణయం కొంత మందికి నచ్చినప్పటికీ, మరికొంత మంది మాత్రం సందేహంతో చూస్తున్నారు. సినిమా థియేటర్స్ లో హిట్ అయితే అలానే వర్కవుట్ అవుతుంది కానీ, ఫలితం అటు ఇటుగా ఉంటే జనాలు డబ్బులు ఇచ్చి యూట్యూబ్‌లో చూస్తారా అన్నది ప్రశ్నగా మారింది. అయితే, ఓటీటీ ట్రెండ్స్‌కు భిన్నంగా అమీర్ ఎంచుకున్న ఈ కొత్త మార్గం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.
