కన్నడలో స్టార్ హీరోగా ఎదిగిన రిషబ్ శెట్టి “కాంతార” సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్థాయిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ నటించిన “కాంతార 1” త్వరలో విడుదలకానుంది. ఇదే సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకి రెండు అవకాశాలు వచ్చాయ్. వాటిలో ఒకటి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిన్నే అధికారికంగా ప్రకటించారు.
ఇలా వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న రిషబ్ పరిస్థితిని చూస్తే, చాలామందికి ఒక్క ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో ప్రకటించిన “జై హనుమాన్” చిత్రానికి ఏమైంది? ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనుండగా, ప్రారంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. మొదట ఈ సినిమా 2025లో విడుదల అవుతుందని చెప్పినా, మధ్యలో ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, రిషబ్ ఇతర ప్రాజెక్టులలో మాత్రమే కనిపించడం అభిమానుల్లో సందేహాలు పెంచాయి.
ఇప్పుడు రిషబ్ మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమవుతుండటంతో, “జై హనుమాన్”పై స్పష్టత రావాలన్న డిమాండ్ ఎక్కువవుతోంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని శాంతగా పూర్తిచేశారా? లేక ఇప్పటికీ పనిలో ఉందా అన్నది మాత్రం ఎవరికీ తెలియని విషయం. ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఏదైనా అధికారిక సమాచారం త్వరగా అందితే బాగుంటుంది.
