రాంగోపాల్ వర్మ నిత్యం తనను తాను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టుకోవాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి వర్మకు ఇప్పుడు ఏపీలో తన మీద కేసులు నమోదు కావడం అనేది లడ్డూ లాంటి అవకాశంగా కలిసి వచ్చింది. ఈ వాతావరణం ఆయనకు పండగలాగా, బ్రహ్మోత్సవంలాగా ఉంటుందని అనుకోవచ్చు. ప్రజలంతా తనగురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రజల నోళ్లలో తాను నానుతూ ఉంటారు. పోలీసులు తనకోసం వెతుకుతూ ఉంటారు. పోలీసుల కళ్లుగప్పి తాను వారితో క్యాట్ మౌస్ గేమ్ ఆడుకుంటున్నారు. మరొక వైపు తనకు ముందస్తు బెయిలు కావాలని, అనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని, తనకు విచారణకు వెళ్లేంత ఖాళీ లేదు గనుక, ఆన్ లైన్ లో వీడియో కాల్ ద్వారా విచారిస్తే కాఫీ తాగుకుంటూ సమాధానాలు చెబుతానని అందుకు అనుమతించాలని కూడా పోలీసులకు లేఖరాసి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల ప్రాథమిక హక్కులను కూడా హరించేయాలనుకుంటూ తదనుగుణంగా రాంగోపాల్ వర్మ కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
హైకోర్టులో తాజాగా పిటిషన్ వేసిన రాంగోపాల్ వర్మ కోరుతున్న కోరిక ఏంటో తెలుసా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై తాను గతంలో సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులకు సంబంధించి.. ఇకపై తనమీద రాష్ట్రంలో ఎక్కడా కేసులు నమోదు అవకూడదట. ప్రజలు తన మీద కేసులు పెట్టడానికి వచ్చినా సరే.. ఆ కేసులు పోలీసులు రిజిస్టరు చేయకుండా ఉండేలా హైకోర్టు రాష్ట్ర డీజీపీని, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలట. రాంగోపాల్ వర్మ పెట్టిన ఒకే పోస్టులకు సంబంధించి.. వర్మ మీద వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతున్నారంటూ ఆయన తరఫు న్యాయవాది రాజగోపాలన్ కోర్టుకు నివేదించారు.
ఇలాంటి వ్యవహారాల్లో ఈ ఇబ్బంది ఎవరికైనా సహజం. సోషల్ మీడియా పోస్టుల మీద మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టేవారు రాష్ట్రంలోనే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా కేసులు పెట్టవచ్చు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆయా పోలీసులు విచారణలు ప్రారంభిస్తే.. వర్మను అదుపులోకి తీసుకుని ఆయా స్టేషన్లు అన్నీ తిప్పవచ్చు. లేదా, ఆయా స్టేషన్లన్నింటికీ వచ్చి వివరణ ఇచ్చి వెళ్లాల్సిందిగా.. ఆయనకు నోటీసులు ఇవ్వవచ్చు. ఇది ఖచ్చితంగా నిందితుడికి ఇబ్బందే అవుతుంది. అలాంటప్పుడు రాంగోపాల్ వర్మ కోర్టును కోరవలసింది ఏమిటి?
తన మీద ఈ పోస్టులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి కేసులు నమోదైనా సరే.. వాటన్నింటినీ కలిపి ఒకే చోట విచారించేలా చూడాలని, ఆ విచారణకు తాను సహకరిస్తానని చెప్పాలి. కోర్టు కూడా ఒకే కేసుగా వాటన్నింటినీ పరిగణించి పరిష్కరించాలని చెప్పాలి. అంతే తప్ప.. అసలు రాష్ట్రంలోని ప్రజలు కేసులు పెట్టడానికే వీల్లేదంటూ, వారిని అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించడం చిత్రంగా ఉంది. ఇలాంటి డిమాండ్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుంది కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు తిరస్కరించడానికే అన్నట్టుగా వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారని నవ్వుకుంటున్నారు.
ప్రజల హక్కులు హరించాలనుకుంటున్న వర్మ!
Tuesday, January 7, 2025