మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం.. ఇప్పుడు అనేక టెన్షన్ల మధ్య సతమతం అవుతున్నారు. ఒకవైపు లిక్కర్ కుంభకోణంలో ప్రధానంగా తాను ఎవరి మీదనైతే ఆధారపడి మూడువేలకోట్ల రూపాయలకుపైగా వసూళ్ల దందాను నడిపించారో సదరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు చిక్కి తన పేరు కూడా బయటపెట్టేశాడు. తనకు వీరవిధేయుడిగా ఉంటూ పోలీసు శాఖను అడ్డు పెట్టుకుని తలచిన అకృత్యాలన్నీ నిరాటంకంగా సాగించడానికి.. కూటమి సర్కారు వచ్చాక పోలీసు కేసులకు డొంకతిరుగుడుగా స్పందించడానికి ప్రధానమైన బ్రెయిన్ లాగా ఉపయోగపడుతూ ఉండిన ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు కూడా పోలీసులకు దొరికిపోయి రిమాండులో ఉన్నారు. ఇన్న టెన్షన్ల మధ్య ఆయనకు రాజకీయంగా కూడా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద కార్యకర్తల్లో దిగువ శ్రేణి నాయకుల్లో కూడా నమ్మకం సడలిపోతోందనడానికి ఈ రెండు దెబ్బలు నిదర్శనాలు! కదిరి మునిసిపాలిటీలో తెలుగుదేశం వారు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గి.. ఆ స్థానం టీడీపీ పరం అయింది. అలాగే ఎలమంచిలిలో ఆల్రెడీ జగన్ పార్టీని వదలిపోయిన ఛైర్ పర్సన్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయి.. కూటమిదే పైచేయి అయింది.
కదిరి మునిసిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 25 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. కోరం ఉండడంతో ఓటింగ్ నిర్వహించారు. ఛైర్ పర్సన్ తో పాటు 11 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 25 మంది పూర్తిగా అవిశ్వాసానికి మద్దతుగానే ఓటు వేశారు. ఎమ్మెల్యే ఎంపీ ఓట్ల అవసరం కూడా ఏర్పడకుండానే.. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కదిరి మునిసిపాలిటీ తెలుగుదేశం పరం అయింది. జగన్ పాలనలో కదిరి మునిసిపాలిటీలో అభివృద్ధి శూన్యం అని.. అందుకే ఆ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు కూడా.. జగన్ మీద విరక్తితో ఆ పార్టీని వీడి వచ్చేస్తున్నారని అన్నారు.
అలాగే అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చిత్రమైన పరిస్థితి ఎదురైంది. అక్కడకూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ మాత్రం కామన్! కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 25 వార్డులున్న ఈ యలమంచిలి మునిసిపాలిటీలో వైసీపీ గతంలో 23 నెగ్గింది. ఎంత అరాచకంగా ఎన్నిక నిర్వహించవచ్చో.. అన్ని దారుణాలూ చేసి గెలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత.. జగన్ మీద నమ్మకం సడలిపోయి ఛైర్ పర్సన్ పిళ్లా రమాకుమారి సహా కొందరు బిజెపిలో చేరారు. పిళ్లా రమాకుమారి.. విశాఖ డెయిరీ ఛైర్మన్ గా పనిచేసిన అడారి ఆనంద్ కు సోదరి. ఆయన కూడా వైసీపీని వీడి బిజెపిలో చేరారు. చైర్ పర్సన్ బిజెపిలో చేరడంతో.. 19 మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. ఓటింగు జరగవలసిన సమావేశానికి మాత్రం అసలు వైసీపీ సభ్యులు ఒక్కరూ కూడా హాజరు కాలేదు. సమావేశాన్ని రెండుగంటలు వాయిదా వేసి మళ్లీ నిర్వహించారు గానీ.. అప్పటికీ ఎవరూ రాలేదు. దాంతో అవిశ్వాసం వీగిపోయింది.
విశాఖ కార్పొరేషన్ తమ చేజారి పోయినందుకు జగన్మోహన్ రెడ్డి గట్టిగానే విలపించారు గానీ.. రెండు మునిసిపాలిటీ కదిరి, ఎలమంచిలి చేజారినందుకు పెద్దగా దిగులు పడడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అనేక టెన్షన్ల మధ్యలో జగన్ కు రెండు దెబ్బలు!
Friday, December 5, 2025
