పాపం కేసిరెడ్డి.. క్యాష్ పాయె.. ఆస్తులూ పాయె..!

Friday, January 30, 2026
వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి ఆయన తన తెలివితేటలు మొత్తం ఉపయోగించారు. జగన్ ఖజానా నింపడానికి తన నెట్వర్క్ మొత్తాన్ని ఉపయోగించారు. ఏదో తనకు తృణమో పణమో వెనకేసుకున్నారు. కానీ పరిస్థితులు వికటించాయి. ఇప్పుడు సర్వ భ్రష్టత్వం చెందిపోయారు. కోట్ల రూపాయల నగదును.. జాగ్రత్తగా ఒక డంప్ లో మెయింటైన్ చేయగా.. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను వెనకేయగా వాటిని కూడా ఇప్పుడు పోలీసులు జప్తు చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో ఏ 1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి పరిస్థితి ఇప్పుడు కడు దయనీయంగా మారిపోయింది.
మూడున్నర వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ముడుపులుగా కాజేసిన లిక్కర్ కుంభకోణంలో మొదటి నిందితుడు రాజ్. జగన్ పురమాయింపు మేరకు మొత్తం ఆయన ప్లాన్ చేసిన స్కెచ్ మేరకు తాను ఈ కుంభకోణం నడిపించినట్లు.. లిక్కర్ కొత్త పాలసీ రూపకల్పనకు తన ఐడియాలు అందించినట్టు ఆయన తొలిదశలో సిట్ కు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుకాయింపులు మొదలయ్యాయి.  ప్రాసెస్ లో భాగంగా జగన్ పురమాయింపు మేరకు దాచారో.. లేదా తన వాటాగా దండుకున్న సొమ్మును దాచుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ లో దాచిన 11 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.  ఆ ఫామ్ హౌస్ తన పేరుతో లేదు గనుక, అది నగదు గనుక తనకు సంబంధం లేదని.. ఆ డబ్బు తనది కాదని దబాయించారు రాజ్. ఎంత దబాయించినా డబ్బు మాత్రం పోయినట్టే. డబ్బు పోతే పోయింది అనుకునే లోగా ఇప్పుడు పోలీసులు ఆస్తులకు కూడా చెక్ పెట్టారు.
ఇదివరకే రాజ్ కేసిరెడ్డి కి చెందిన కొన్ని ఆస్తులను జప్తు చేసిన పోలీసులు ఇప్పుడు మరికొన్ని ఆస్తుల జప్తుకు అనుమతి తీసుకున్నారు. వీటి మొత్తం మార్కెట్ విలువ 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. క్యాష్ పాయె.. ఆస్తులు కూడా పాయె.. అని వగచి విచారించడం మినహా రాజ్ కు మరో మార్గం లేకుండా పోయింది.
జగన్ జమానా లో చెలరేగిపోయి దందాలు చేసినందుకు.. విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు.. ఇప్పుడు అనుభవిస్తున్న రాజ్ కేసిరెడ్డి కి ఇప్పటికైనా బుద్ధి మారితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. వేరే వాళ్ళు ఏదైనా ఆటలో తాను కేవలం ఒక టూల్ అని, బొమ్మ అని ఆయన ఒప్పుకోకపోతే మరిన్ని ఆస్తులు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles