పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మీద గత కొంతకాలంగా విపరీతమైన ఎదురుచూపులుండగా, దీని నిర్మాణం దాదాపు ఐదేళ్లు సాగింది. మధ్యలో చాలా సార్లు వాయిదాలు పడటం, పలు సాంకేతిక సమస్యలు ఎదురవటం, రాజకీయ రంగంలో పవన్ బిజీగా ఉండటం వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది.
కానీ రీసెంట్‌గా చిత్రబృందం అట్టహాసంగా ప్రమోషన్స్ చేయడంతో మళ్ళీ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పవన్ కూడా ఇతర సినిమాల్లో చేయనంతగా ప్రమోషనల్ షోలలో పాల్గొనడం వల్ల అభిమానుల్లో నమ్మకం వచ్చింది. విడుదల ముందు రోజే ప్రీమియర్స్ వేయడం ద్వారా చిత్రబృందం తమ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చూపించింది. అయితే విడుదలైన తరువాత సినిమా కంటెంట్‌కి సంబంధించి కొన్ని మిశ్రమ స్పందనలు రావడం, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల రెండో రోజునుంచి బుకింగ్స్‌లో కొంత తగ్గుదల కనిపించింది.
ఇదంతా దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 28 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ ధరలు సాధారణంగా ఉండబోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఉన్న స్పెషల్ రేట్లు తొలగించి, మామూలు టికెట్ ధరలకే ఈ సినిమా చూడొచ్చు. దీని వల్ల సినిమాకు ఇంకొంచెం ఊపొస్తుందేమో చూడాలి.
ఇప్పటికైనా మంచి రన్ రావాలంటే టికెట్ ధరలు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ప్రేక్షకులు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తారో, మళ్ళీ థియేటర్లవైపు వస్తారో లేదో దగ్గర నుండి గమనించాల్సిందే.
