టాలీవుడ్‌లో గామా అవార్డ్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దుబాయ్‌లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు జరిపిన ఈ వేడుకలు, ఐదోసారి మరింత గ్రాండ్‌గా షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆగస్టు 30న జరిగాయి. వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో, కేఇన్‌ఫ్రా ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈసారి గామా అవార్డ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌లుగా దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, సంగీత దర్శకుడు కోటి వ్యవహరించారు. వీరి పర్యవేక్షణలో వివిధ విభాగాల్లో అవార్డులు అందజేశారు. జాతీయస్థాయిలో భారీ అంచనాలు రేపిన “పుష్ప 2: ది రూల్” ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచి బెస్ట్ మూవీ అవార్డును దక్కించుకుంది. అల్లు అర్జున్ తన శక్తివంతమైన నటనతో బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక కాగా, సుకుమార్‌కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. అదే చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత విభాగంలో గెలిచాడు.
మీనాక్షి చౌదరి “లక్కీ భాస్కర్”లో తన నటనతో బెస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కల్కి 2898 AD చిత్రాన్ని నిర్మించిన అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్‌లకు బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు లభించింది. రత్నవేలు “దేవర” సినిమాకు సినిమాటోగ్రఫీ విభాగంలో మెప్పించగా, రామజోగయ్య శాస్త్రి “దేవర” పాటతో బెస్ట్ లిరిసిస్ట్‌గా గెలిచారు. సింగర్స్ విభాగంలో అనురాగ్ కులకర్ణి, మంగ్లీ, సమీరా భరద్వాజ్‌లు అవార్డులు అందుకున్నారు.
ఈవెంట్‌లో కొత్తగా వెలుగులోకి వస్తున్న నటీనటులకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. కిరణ్ అబ్బవరం, రాజా రవీంద్ర, రోషన్, శ్రీదేవి, మానస వారణాశి తదితరులు తమ ప్రతిభతో ప్రత్యేక అవార్డులను కైవసం చేసుకున్నారు. “కోర్ట్”, “సారంగదరియా”, “శివం భజే” వంటి సినిమాల నుంచి కొత్త టాలెంట్స్‌ను ప్రోత్సహించారు.
అదే విధంగా, హాస్యరంగానికి చేసిన సేవలకు బ్రహ్మానందంకు గ్లోబల్ కమెడియన్ అవార్డు అందజేశారు. నిర్మాత అశ్వినీ దత్ జీవిత సాఫల్య అవార్డు అందుకున్నారు. సత్యదేవ్ “జీబ్రా” సినిమాతో ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు గెలిచాడు. అభిమానుల ఫేవరెట్ స్టార్‌గా ఊర్వశి రౌటెలా సత్కారం అందుకుంది.
