న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇప్పుడు ఓ వివాదంతో వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ చేసిన ఆరోపణలతో ఆయన చర్చకు వస్తున్నాడు. విన్సీ సోనీ అనే నటి.. షైన్ టామ్ చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో, ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘సూత్రవాక్యం’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షైన్ టామ్ చాకో.. తన ప్రవర్తన వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా చింతిస్తున్నానని, ఆమెను బాధపెట్టినందుకు నిజంగా సారీ చెబుతున్నానని చెప్పారు. అలాంటి వ్యవహారంలో తాను మర్యాదగా ఉండాల్సిందని ఇప్పుడు తనకు అర్థమైందని చెప్పారు.
ఇక ఈ విషయంపై విన్సీ కూడా స్పందించింది. తన అనుభవం నిజమేనని, అప్పుడు ఎదురైన పరిస్థితి వల్లే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పింది. అయితే ప్రస్తుతం చాకో క్షమాపణ చెప్పడం వల్ల ఈ వివాదం ముగిసినట్లే అనిపిస్తుండటం అభిమానులను సంతృప్తిపర్చుతోంది.
ఈ పరిణామంతో ‘సూత్రవాక్యం’ సినిమా ప్రచార కార్యక్రమాలకి వ్యతిరేకంగా వస్తున్న నెగటివ్ పవనాలు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వివాదం ఇలానే కొనసాగి ఉంటే సినిమాపై ప్రభావం ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరువురి స్పందనతో ఇష్యూ క్లోజ్ అయినట్టే.
