లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సతీ లీలావతి’ సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మంచి ఫన్ అండ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉన్నాయని టీమ్ చెబుతోంది.
తాజాగా ఈ సినిమా టీజర్‌కు రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 29న ఉదయం 10.30 గంటలకు టీజర్‌ను విడుదల చేసిన్నట్లు అధికారికంగా తెలిపింది చిత్రబృందం. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు.
ఈ చిత్రంలో లావణ్య, దేవ్ మోహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం టీమ్‌కు ఉంది. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో టీజర్ పూర్తి హాస్యభరితంగా ఉంటుంది అంటున్నారు. మిక్కీ జే మేయర్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. నాగమోహన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
