స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే ఈ డాక్యుమెంటరీ ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలపై ఆధారపడి రూపొందించారు. అయితే ఇది విడుదలైన దగ్గర నుంచే కొన్ని వివాదాలకు దారితీస్తోంది.
ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన పలు చిత్రాల ఫుటేజీలు చూపించడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని సీన్లు ఇందులో కనిపించడంతో ఆ సినిమా హక్కులు తమ దగ్గర ఉన్నాయని చెప్పిన ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కోర్టులో కేసు వేసింది. తమ అనుమతి లేకుండా విజువల్స్ వాడినట్టు పేర్కొంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసును పరిశీలించిన కోర్టు డాక్యుమెంటరీ నిర్మాతలు అయిన టార్క్ స్టూడియోస్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. తమకు పర్మిషన్ లేకుండా ఫుటేజ్ వినియోగించడం వల్ల నష్టం జరిగిందని, దానికి పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనితో ఈ డాక్యుమెంటరీ చుట్టూ వివాదం మళ్లీ వేడెక్కింది.
ఇది మొదటి వివాదం కాదు. గతంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రంలోనూ కొంత ఫుటేజ్ ఈ డాక్యుమెంటరీలో వినియోగించారన్న ఆరోపణలపై కూడా ధనుష్ చర్యలు చేపట్టిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ‘చంద్రముఖి’ కేసు కోర్టులో ఉండడంతో, నయనతారపై తీసిన ఈ డాక్యుమెంటరీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకవైపు ఆమె జీవితంలో ఉన్న సంఘర్షణలు, మరోవైపు ఇప్పుడు తలెత్తిన లీగల్ ఇష్యూలు – ఇవి అన్నీ కలసి ఈ డాక్యుమెంటరీ చుట్టూ చర్చకు తావిస్తున్నాయి.
