సినిమా ప్రమోషన్లలో దర్శకులు, నిర్మాతలు తరచూ హైప్ క్రియేట్ చేయడానికి విభిన్న స్టేట్మెంట్స్ చేస్తుంటారు. ప్రేక్షకులను ఆకర్షించేందుకు “సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇస్తాం” అనే మాటల్ని కూడా చాలాసార్లు విన్నాం. కానీ తాజాగా విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన మాట మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అయింది. సినిమా నచ్చకపోతే తన చెప్పుతో తనను తానే కొడతానని ఆయన బోల్డ్‌గా ప్రకటించారు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఆయన ఊహించినట్టుగా పోలేదు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్‌కి వెళ్లిన మోహన్ శ్రీవత్సకు అక్కడ కేవలం కొద్ది మంది మాత్రమే కనిపించారని, వారిని అడిగితే సినిమా బాగానే ఉందని చెప్పినా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం చాలా తక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఎందుకు పట్టించుకోవడం లేదో, అదే సమయంలో మలయాళ చిత్రాలకు మాత్రం మంచి ఆదరణ లభిస్తోందని ఆయన ఎమోషనల్‌గా ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై తాను మలయాళంలో సినిమాలు చేసి అక్కడ విజయం సాధించాలనుకుంటున్నానని స్పష్టంగా తెలిపారు.
