పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఓజీ” సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓజీ కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా అనిపించిందని ఆయన చెప్పారు. సాహో తర్వాత త్రివిక్రమ్ ద్వారా సుజీత్ పరిచయం అయ్యాడని, కథ చెప్పేటప్పుడు సాదాసీదాగా కనిపించినా, దాన్ని తెరపై చూపించే సమయంలో అతని ప్రతిభ అద్భుతంగా బయటపడిందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇక ఈ చిత్రానికి ప్రధాన కారణం సుజీత్ విజన్ అని, దానిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది సంగీత దర్శకుడు తమన్ అని పవన్ పేర్కొన్నారు. వీరిద్దరూ సినిమా అంతా ఒక ప్రత్యేకమైన మూడ్‌లో పనిచేశారని, తాను కూడా ఆ వాతావరణంలో మునిగిపోయానని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి మర్చిపోయేంతగా ఈ సినిమాతో లీనమయ్యానని చెప్పుకొచ్చారు.
ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, ఆమెతో ఉన్న ప్రేమకథ పెద్దది కాకపోయినా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది అని ఆయన అన్నారు.
