నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా రెండో పుట్టినిల్లు హిందూపురం. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌరసన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు. పద్మభూషణ్ మీకు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అన్నారు. కాదు సరైన సమయంలోనే ఇచ్చారని చెప్పా’ అని బాలయ్య అన్నారు.
బాలయ్య బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాన్నగారి శతజయంతి నిర్వహించుకున్నాం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను, సినిమాల పరంగా నాలుగు వరుస విజయాలు చూశాను, హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. 50 ఏళ్లు కథానాయకుడిగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో నాకు తెలిసి మరోకరు ఉండి ఉండరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ‘ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు’ అని అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
