పవన్‌ సినిమాలో ఆ బాలీవుడ్‌ నటుడు!

Wednesday, January 22, 2025

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ హరిహర వీరమల్లు గురించి అటు అభిమానులతో పాటు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాకి మరో అదనపు ఆకర్షణ కూడా తోడైంది. లెజెండరీ నటులలో ఒకరైన అనుపమ్‌ ఖేర్‌ హరి హర వీరమల్లు లో భాగమయ్యారు.

ఈ సినిమాలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు టీం అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు.

‘హరి హర వీరమల్లు’ సినిమా జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ పేర్కొంది. ఇటీవల, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.

ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో, మరింత రెట్టింపు ఉత్సాహంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ సినిమా మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేయడం కోసం సాంకేతికత బృందంలో చేరారు. లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి,  వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే మిగిలిన భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది. మరోవైపు సమాంతరంగా నిర్మాణానంతర‌ పనులు ప్రారంభించారు. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. “హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్” త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించబోతున్నారు..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles