ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన సినిమా “కుబేర”. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ అయిన వెంటనే సినిమా బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తూ, మంచి టాక్‌తో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ప్రేక్షకుల స్పందన చూస్తే.. ఇది ఓ సూపర్ హిట్ మూవీ అన్న విషయం ఖరారైపోయింది.
ధనుష్ వేసిన పాత్ర మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని పూర్తిగా ఆకట్టుకుంది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి భావోద్వేగాల్ని చాలా బాగా చూపించాడు. అతడి నటన వల్లే సినిమా మరింత బలంగా నిలిచింది. ధనుష్ స్క్రీన్ మీద చూపించిన ఎమోషన్స్ ప్రేక్షకుల్లో తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి.
ఇక ఇందులోని ధనుష్ క్యారెక్టర్ గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాత్రను మొదట విజయ్ దేవరకొండకే ఆఫర్ చేశారట. గతంలో విజయ్, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ‘కుబేర’లో అతడిని కీలక పాత్రకు తీసుకోవాలనుకున్నారట.
కానీ ఆ రోల్‌లోని బిచ్చగాడి నలుపు వాతావరణం తనకు సరిపడదని విజయ్ అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే ఆయన ఈ అవకాశాన్ని వదిలేశాడట. ఇప్పుడు అయితే ఈ పాత్రలో ధనుష్ చేసిన మ్యాజిక్ చూసిన ఫ్యాన్స్.. విజయ్ దేవరకొండ తప్పిపోయిన గోల్డెన్ ఛాన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఓ మంచి కథ, మంచి నటన కలిస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘కుబేర’ మరోసారి నిరూపించింది.
