షూటింగ్‌ లో స్టంట్‌ మాస్టర్‌ మృతి!

Wednesday, December 10, 2025

తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వెట్టువాన్’ సెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది.

ఇటీవల చిత్రీకరణ సమయంలో ఓ ప్రమాదకర యాక్షన్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంది. కారు పల్టీ కొట్టే సన్నివేశంలో పాల్గొన్న స్టంట్ ఆర్టిస్ట్ ఎస్‌ఎం రాజు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆ దృశ్యం ఎంత ప్రమాదకరమైందంటే, అక్కడే ఉన్న యూనిట్ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటన చిత్రబృందాన్ని ఎంతో కలచివేసింది. షూటింగ్‌లో ఇలా ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరం. స్టంట్‌మన్ ఎస్‌ఎం రాజు మరణవార్త విన్న చిత్ర పరిశ్రమలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ విషాద ఘటనపై నటుడు విశాల్ స్పందించాడు. ఎస్‌ఎం రాజు కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తానని చెప్పిన విశాల్, తన సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తి కెమెరా వెనక తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే, అలాంటి వాళ్లకు గౌరవం చూపించాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

‘వెట్టువాన్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఈ విషాద ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విజయవంతం కావాలని కష్టపడుతున్న యూనిట్‌కి ఇలా ఓ తీరని విషాదం తగలడం అందరినీ కలచివేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles