రేవతి భర్త చెప్తే బన్నీని వదిలేయాలా? సాధ్యమా?

Saturday, January 18, 2025

ఇవాళ దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తున్నది. అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించడం, ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ సకాలంలో అందక ఆయన ప్రస్తుతం (శుక్రవారం  రాత్రి) జైల్లోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడడం ఇత్యాది అంశాలు ఇప్పుడు సంచలనంగా ప్రజల నోళ్లలో చర్చకు వస్తున్నాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ కు అనుకూలంగా ఒక వాదన వినిపిస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ రేవతి యొక్క భర్త స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి.. తాము పెట్టిన పోలీసు కేసు ఉపసంహరించుకుంటాం అని.. అల్లు అర్జున్ ను పోలీసులు విడుదల చేసేయాలని కోరుతున్నారు.

మరణించిన మహిళ భర్తే స్వయంగా కేసు వెనక్కు తీసుకుంటాం అని చెబుతున్నప్పుడు.. ఇక పోలీసులకేంటి నొప్పి.. వారింకా ఎందుకు  బన్నీని వేధించాలని అనుకుంటున్నారు? అంటూ తటస్థుల్లో కూడా ఒక వాదన తలెత్తుతోంది. కానీ  ఇక్కడ ప్రాక్టికల్ గా ఉండగల సంభావ్యతలను ఎవ్వరూ గమనించడంలేదు. రేవతి భర్త చెప్తే బన్నీని వదిలేయాలా? చట్టం అందుకు ఎలా అనుమతిస్తుంది? అనేది ఆలోచించడం లేదు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రామారావు అనే వ్యక్తి భార్య రోడ్డు మీద వెళుతుండగా.. బస్సు ఢీకొని మరణించింది అనుకుందాం. పోలీసులు పెట్టే కేసుతో పాటు రామారావు కూడా కేసు పెడతారు. పోలీసులు బస్సు డ్రైవరును, అతనికి లైసెన్సు లేకపోయినా డ్రైవరు ఉద్యోగం ఇచ్చి బస్సు ఇచ్చి రోడ్డు మీదకు పంపిన దాని యజమానిని కూడా అరెస్టు చేస్తారు. ఈలోగా ఆ బస్సు యజమాని ధనవంతుడు గనుక రామారావును ప్రలోభ పెట్టి కొంత సొమ్ము ముట్టజెబుతాడు. అప్పుడు రామారావు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. ‘ఈ కేసు నేను వెనక్కు తీసుకుంటాను వారిని విడిచిపెట్టండి’ అని అంటే వదిలేయాలా? సాధ్యమవుతుందా? లైసెన్సు లేకుండా బస్సు నడిపేవాడికీ, వాడిని ఆ పనిలో పెట్టుకున్న వాడినీ ఎలాగైనా శిక్షించి తీరాల్సిందే కదా? మరి అదే మాదిరి సిద్ధాంతమే ఇక్కడ బన్నీ విషయంలో కూడా వర్తిస్తుంది.

పోలీసులకు సమాచారం లేకుండా బన్నీ వంటి సెలబ్రిటీ ర్యాలీ రూపంలో జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడం పెద్ద తప్పు. తమ సొంత మనుషులను సెక్యూరిటీగా పెట్టుకుని అక్కడ జనం తొక్కిడిని కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు. హీరో థియేటర్ వద్దకు వస్తున్నప్పుడు భద్రత ఏర్పాట్ల కోసం పోలీసులను ఆశ్రయించి.. అవసరమైన ఫీజులు ఏమైనా ఉంటే చెల్లించి.. పోలీసు రక్షణ ఏర్పాటు చేసుకుని ఉండడం థియేటర్ యాజమాన్యం బాధ్యత.

పోలీసులు సంధ్య థియేటర్ వారికి హీరో హీరోయిన్లు అక్కడకు రావొద్దని లేఖ రాసిన తర్వాత కూడా.. అర్జున్ వెళ్లడం తప్పు. వీటిలో ఏది జరిగి ఉన్నప్పటికీ.. ఆ ప్రమాదాన్ని ఆపి ఉండవచ్చు. అలాంటిది.. అందుకు బాధ్యులైన వారికి శిక్ష పడాల్సిందే. అదేం లేకుండా.. రేవతి భర్త జాలి చూపించాడు కాబట్టి.. కేసు వెనక్కు అంటున్నాడు కాబట్టి.. బన్నీని వదిలేయాలనుకోవడం అవివేకం అవుతుంది. అలా జరిగితే.. ఈ దేశంలో సగం కేసులు ఉండనే ఉండవు. హత్యలు జరిగిన అనేక కేసుల్లో కూడా బాధిత కుటుంబాలను డబ్బుతో కొనేసి కేసులు ఉపసంహరించుకునేలా చేయగల ప్రబుద్ధులు అనేకమంది ఉంటారు. అందుకే ఈ విషయంలో దేశమంతా సర్వత్రా చర్చ జరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles