యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యిందని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతోంది. తారక్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయం అయ్యిందని ఓ ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. తాజాగా ఈ విషయం గురించి ఎన్టీఆర్ టీమ్ ఓ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని తెలియజేశారు.
ముందు జాగ్రత్త చర్యగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారు. ఇలా గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నాడు అని తెలిపారు. కట్టిన కట్టును రెండు వారాల్లో తొలగిస్తారని త్వరలో సినిమా షూటింగ్స్ లో తిరిగి బిజీ కానున్నారు అని పేర్కొన్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నాము అని ఎన్టీఆర్ టీమ్ పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాలో బిజీగా ఉన్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలయితే ఉన్నాయి. దేవర సినిమా రెండు పార్టులుగా పాన్ ఇండియా లెవెల్ లోకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.