బాలీవుడ్‌లో యాక్షన్ స్పై సినిమాలకు ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో రూపొందే చిత్రాలు అయితే ఈ జానర్‌కు మరింత గ్లామర్ తెచ్చాయి. ఈ బ్యానర్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ వార్-2 మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కనిపించబోతున్నట్టు తెలిసిన దగ్గర నుంచే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందన్న నమ్మకంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు.
ఇదే బ్యానర్‌లో రూపొందుతున్న మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ఆల్ఫా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో మొదటి లేడీ స్పై థ్రిల్లర్ కావడం విశేషం. ఈ సినిమాలో ఆలియా భట్, శార్వరి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇద్దరూ సాహసోపేతమైన మిషన్‌కు వెళ్లే పాత్రల్లో నటించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. అది రెగ్యులర్ పాటలలా కాకుండా, సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆ పాట కోసం ఆలియా, శార్వరి కలిసి ప్రత్యేకంగా రిహార్సల్స్ చేస్తున్నారట. సినిమాకు ఈ సాంగ్ విజువల్స్ కొత్తగా ఉంటాయని యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాను శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు, హృతిక్ రోషన్ ఈ సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి యష్ రాజ్ సంస్థ నుంచి వస్తున్న ఈ లేడీ స్పై థ్రిల్లర్ కూడా కొత్తదనంతో, స్టైల్‌తో అలరించబోతుందన్నమాట.
