బాలీవుడ్ నటుల్లో అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన హీరో సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు భారీ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. నవాబుల కుటుంబానికి చెందిన ఆయన వద్ద వేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఆస్తి మధ్యప్రదేశ్ లో ఉండగా, దీని పట్ల సైఫ్ ఆల్రెడీ న్యాయపోరాటం మొదలుపెట్టారు. కానీ ఆయన ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరి అయిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం ‘ఎనిమీ ప్రాపర్టీ’గా గుర్తించినట్టు సమాచారం. భారత విభజన సమయంలో సైఫ్ కుటుంబ సభ్యుల్లో కొందరు పాకిస్థాన్‌కి వెళ్లిపోయారని, వారసుల్లేని ఆస్తిగా ఈ ప్రాపర్టీని ప్రకటించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాపర్టీపై సైఫ్ ఆలీ ఖాన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆయన వాదనను తిరస్కరించింది. పైగా ఈ కేసును మళ్లీ ట్రయల్ కోర్టులో విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దాంతో పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెల్లుబాటు చేయడంతో, ఆయన హక్కులు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ గతంలో తన పూర్వీకుల ఆస్తులపై పలు మార్లు స్వామ్యత చూపించే ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వ విధానాలు ఆయనకు అడ్డుకట్టు అవుతున్నాయి. ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించిన ఈ భూముల విలువ ఇప్పుడు రూ.15 వేల కోట్లు ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ తరహా కేసులు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ పూర్వ కాలంలో జరిగిన చరిత్ర, ఆ తరువాత తీసుకున్న పాలసీల వల్ల నేటి తరానికి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సైఫ్ ఆలీ ఖాన్ పిటీషన్ తిరస్కరణతో ఈ కేసు దాదాపుగా ఆయనకు నష్టంగా ముగిసేలా కనిపిస్తున్నప్పటికీ, ఇంకా కోర్టు తుది తీర్పు రావాల్సి ఉంది.
