నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు, బీజీఎం కూడా ఆడియెన్స్‌ను బాగా అలరించింది. ఇండస్ట్రీలో ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా ఏకంగా వేరే దేశంలో విడుదలకు సిద్దం అయ్యింది. ఫిబ్రవరి 14న ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఫక్తు కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా జపాన్‌లో ఎంతమేర ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కినా, టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ సినిమా మన దగ్గర విజయం అందుకుంది. మరి జపాన్ దేశంలో ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోగలదా.. అనేది వేచి చూడాలి.