కల్కి సినిమా టికెట్ ధరలను 14 రోజుల పాటు పెంచుకుని అమ్ముకోడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి అనుమతులు ప్రభుత్వాలు ఇవ్వడం ఇవాళ కొత్త కాదు. ప్రతి ప్రభుత్వమూ తమ హయాంలో భారీ సినిమాల నిర్మాతలు వచ్చి సంప్రదించినప్పుడు ఇలాంటి వెసులుబాటు ఇస్తూనే ఉన్నది. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసారిగా ఈ ప్రతిపాదనతో వచ్చిన కల్కి చిత్రానికి అశ్వనీదత్ నిర్మాత! ఆయన తెలుగుదేశం అనుకూల వ్యక్తి. కాబట్టి.. రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి.. వివాదంగా మార్చడానికి కొందరు ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. అసలు టికెట్ ధరల పెంపు గురించి రేకెత్తుతున్న ఈ వివాదం సబబేనా? అనే చర్చ ఇప్పుడు అవసరం.
సినిమా అనేది సృజనాత్మకతతో ముడిపడిన మాధ్యమం. వారి సృజనను నమ్ముకుని వారు ఒక నమ్మకంతో డబ్బు పెట్టుబడి పెట్టి ఒక ‘ప్రోడక్ట్’ సినిమాను తయారుచేస్తారు. తమ ప్రోడక్ట్ ధరను నిర్ణయించే హక్కు తయారీదారుకు ఉంటుందా? ఉండదా? అనేది మాత్రమే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి.
ఉదాహరణకు మందుల తయారీ గురించి తీసుకుందాం. మందుల్లో కొన్ని కేటగిరీలు ఉంటాయి. ప్రజలందరకూ తప్పనిసరిగా అవసరమయ్యే మందుల ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కానీ లగ్జరీ కేటగిరీలోకి వచ్చే మందులు కొన్ని ఉంటాయి. కాంట్రాసెప్టివ్స్, కండోమ్స్ దగ్గరినుంచి సౌందర్యసాధనకు వాడే మందులు, క్రీములు లాంటివి. వీటి ధరను ఆయా కంపెనీలు వాళ్ల ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయించుకోవచ్చు. ఒక క్రీముకు వందరూపాయలు తయారీ ఖర్చు అయితే.. వెయ్యిరూపాయలు ధర పెట్టుకున్నా కూడా అభ్యంతరాలు లేవు. అంటే నిత్యావసరాలు కాని వాటి విషయంలో తాను తయారు చేసిన ప్రోడక్టుకు ధర నిర్ణయించుకునే హక్కు.. తయారీదారుకు ఉంటుంది. ఈ దేశంలో అలాంటి హక్కు లేనిది సినిమా నిర్మాతకు మాత్రమే. నిజానికి వాళ్లు ముచ్చటపడి భారీ పెట్టుబడితో సినిమా తీశాక.. ధర వారు నిర్ణయించుకోవాలి. అందరినీ తప్పనిసరిగా అదే ధర పెట్టి టికెట్ కొని.. హాలుకు వచ్చి సినిమా చూడాల్సిందే అని వారు ప్రజలను ఒత్తిడి చేయడం లేదు కదా.
ఇంకా సూటిగా చెప్పాలంటే.. అసలు ప్రతి పెద్ద సినిమాకు ధరలు పెంచుకోవడానికి వెళ్లి ప్రభుత్వాన్ని అనుమతి అడిగే పద్ధతే తప్పు. వారికి నచ్చినట్టుగా వారు ధరలు పెట్టుకోవచ్చు. సినిమా ఎవరూ చూడకపోతే.. గతిలేక వారే ధరలు తగ్గించి మళ్లీ షోలు వేసుకుంటారు. వ్యాపారం చేసుకోవాలి కదా.. ఇలాంటి కోణంలో ఆలోచిస్తే.. అసలు వివాదం ఉండదు.
ధరల పెంపునకు అనుమతిచ్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందా లేదా? కూలంకషంగా లోతుగా పరిశీలిస్తామని పిల్ లను విచారిస్తున్న హైకోర్టు చెప్పిన నేపథ్యంలో.. అసలు ధరలు పెంచుకోవడానికి ఒకరి అనుమతి నిర్మాత అడగాల్సిన అవసరం ఉందా అనేది కూడా పరిశీలించాలి. ఎందుకంటే.. ఎంత ధర పెట్టుకున్నా.. దాని మీద ప్రభుత్వం పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయవచ్చు. ప్రభుత్వం పాత్ర అంతే. అలా కాకుండా, ధరను తామే నియంత్రిస్తామని ప్రభుత్వం అనడం కరెక్టు కాదు కదా.. అనే అంశాన్ని గమనించాలి.
సినిమా టికెట్ ధరలు : సృజనను చంపే వివాదం!
Thursday, November 21, 2024