దర్శకుడు బి. గోపాల్ చేతుల మీదుగా “మ్యానిప్యూలేటర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించబడింది. మొదట ఈ చిత్రాన్ని “ఏ స్టార్ ఈజ్ బార్న్” అనే పేరుతో ప్రకటించగా, ఇప్పుడు టైటిల్‌ను మార్చి “మ్యానిప్యూలేటర్”గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలు విజే సాగర్ చేపట్టగా, నిర్మాణం సి. రవి సాగర్ మరియు విజే సాగర్ కలిసి నిర్వహిస్తున్నారు. సి ఆర్ ప్రొడక్షన్స్, విజే ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్, హీరోయిన్‌గా ప్రియా పాల్ నటిస్తుండగా, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి తో పాటు 43 మంది కొత్త కళాకారులు ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తున్నారు. కథాంశం, ప్రదర్శనలో ప్రత్యేకతతో కూడిన కల్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
సంగీతాన్ని సునీల్ కశ్యప్ అందించగా, ఐదు విభిన్నమైన పాటలు ఈ చిత్రంలో ఉంటాయి. వీటికి సాహిత్యం తనికెళ్ల శంకర్, వరికుప్పల యాదగిరి, విశ్వనాథ్ రాశారు. త్వరలో గ్రాండ్ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించి, తరువాత సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
