సానుభూతి పొందాలనుకుంటున్న మంచు మనోజ్!

Friday, January 17, 2025

మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న రచ్చ, ఘర్షణలు, వరుస ప్రెస్ మీట్లు ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అపరిమితమైన వినోదాన్ని అందిస్తున్నాయి. ఒక కుటుంబం ఆస్తుల తగాదాల కారణంగా బజార్న పడడం.. సాధారణంగా ఇరుగుపొరుగు వారికి కొన్ని వారాలకు నెలలకు సరిపడా చర్చలు సాగించుకోవడానికి, చాటుమాటుగా మాట్లాడుకోవడానికి అవసరమైన ముడిసరుకును అందిస్తుంది. అదే కుటుంబం ఒక సెలబ్రటికి చెందినది అయితే.. ఇక చెప్పేదేముంది. అందరి దృష్టి ఆ వ్యవహారం మీదనే పడుతోంది. సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీల ప్రెవేటు వ్యవహారాల్లో మీడియా ఛానెళ్లకు చాలా ఆసక్తి ఉంటుంది. తమ టీఆర్పీ రేటింగులు అమాంతం పెరిగిపోతాయని ఒక కక్కుర్తి ఉంటుంది. వారంతా కూడా ఇప్పుడు మంచు కుటుంబం రచ్చల కవరేజీ కోసం రెండు మూడు బృందాల వంతున ఏర్పాటుచేసి.. ఆ వినోదాన్ని రాష్ట్ర ప్రజలకు పంచి పెడుతున్నారు.

ఈ క్రమంలో.. అసలు ఈ ఎపిసోడ్ ద్వారా మంచు మనోజ్ తాను యావత్తు సమాజపు సానుభూతి పొందాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకునే సందర్భంలోనే మంచు కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదు. అప్పట్లో మంచు విష్ణు- వెరోనికాను పెళ్లి చేసుకోవడం కూడా ఆయనకు ఇష్టం లేదు. కానీ.. వారి ప్రేమ వ్యవహారం ముందే మీడియాకు లీక్ అయిపోవడంతో పాటు అనేక రకాల అనివార్య కారణాల నేపథ్యంలో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వెరోనికా ఆ ఇంటి కోడలిగా తన స్థానాన్ని బంధాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అలాంటి కసరత్తు మంచు మనోజ్ విషయంలో జరగలేదు. మౌనికతో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టంలేదు. వారు పెళ్లికి అసలు రావడం లేదని కూడా వార్తలు వచ్చాయి. చివరికి వచ్చారు మమ అనిపించారు. అప్పటినుంచి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని కొడుకు కొట్టేంతగా, కొడుకును బౌన్సర్లతో ఇంటినుంచి గెంటేయించేంతగా ఆ విభేదాలు ముదిరాయి. కొడుకు తాగుబోతుగా మారి నాశనం అయిపోయాడని మోహన్ బాబు అంటున్నారు. ఇప్పుడున్న మోహన్ బాబు తన నాన్నే కాదని మనోజ్ అంటున్నారు.

అయితే ఈ ఎపిసోడ్ లో తాను వ్యక్తిగతంగా అందరి సానుభూతి పొందాలని మనోజ్ వ్యూహాత్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. గొడవలన్నీ ఆస్తలు కోసమే కాగా, తాను ఆస్తుల గురించి అడగడం లేదని, తనకు ఆస్తులు డబ్బులు అక్కర్లేదని ధర్మ పన్నాలు చెబుతున్నారు మనోజ్. అదే సమయంలో విలేకర్లపై మోహన్ బాబు చేయి చేసుకున్నందుకు ఆయన తరఫున తాను సారీ చెబుతున్నానని అనడం ద్వారా.. ఒక మీడియా చానెల్ ను తనకు అనుకూలంగా మార్చుకుని, వారి ద్వారా తండ్రి మీద, విష్ణుమీద బురద చల్లడానికి కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే.. విద్యానికేతన్ లో లోపాలమీద పోరాడతానని అంటున్నారు. ఇదంతా పైపైకి చెబుతున్న మెరమెచ్చు బూటకపు మాటలుగానే జనం గుర్తిస్తున్నారు. మంచు మోహన్ బాబు దూరం పెట్టిన తర్వాత.. ఆస్తుల కోసం సాగుతున్న రచ్చలో ఇలాంటి మాయమాటలతో సానుభూతి కోసం మనోజ్ ప్రయత్నిస్తున్నట్టు అంతా అనుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles