పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్న యానిమేషన్ సినిమా “మహావతార్ నరసింహ” ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ఎవరో స్టార్ హీరోలతో లేకుండా, పూర్తిగా యానిమేషన్ ఫార్మాట్‌లో తెరకెక్కింది. అయినా కూడా చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సూపర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది.
దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఎనిమిది రోజుల ప్రదర్శనతోనే భారీ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇండియన్ యానిమేషన్ సినిమాల చరిత్రలో ఈ స్థాయిలో రాబడి అందుకున్న చిత్రం ఇదే అని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని యానిమేషన్ చిత్రాల కలెక్షన్లను అధిగమిస్తూ ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు చెబుతున్నారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అదే స్థాయిలో స్పందన పొందుతోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకి ఆదరణ గణనీయంగా ఉందట. స్ట్రాంగ్ బుకింగ్స్ కొనసాగుతుండటంతో, ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు థియేటర్లలో నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా యానిమేషన్ సినిమాలకు భారతీయ ప్రేక్షకుల నుంచి పరిమిత స్పందనే వస్తూ ఉండేది. కానీ “మహావతార్ నరసింహ” ఆ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది. కథ, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ఇలా అన్ని అంశాలు కలిసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికి ఈ సినిమా కలెక్షన్ల రీత్యా కొనసాగుతున్న దూకుడు చూస్తే ఇది ఓ రికార్డు స్థాయిలో నిలిచే అవకాశముంది.
