తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. పేరుకే తెలుగు హీరో కానీ తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. నిజానికి టాలీవుడ్‌లో సందీప్ కిషన్ ను ఉపయోగించుకునే దర్శకులే కరవయ్యారు. ఇక్కడ ఎప్పుడో ఓ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో.. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలో మాత్రం మెరుస్తున్నాడు.
రీసెంట్ గా ధనుష్ ‘రాయన్’ లో ముత్తువేల్ రాయన్‌గా తన నటనతో అదరగొట్టాడు. ఈ మధ్య దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. ఇక తాజాగా ఈ హీరోకి మరో భారీ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబోలో వస్తున్న ‘కూలీ’ మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ చేస్తున్నాడంట. సినిమాలో అతను కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సందీప్ కిషన్ కి మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
లోకేష్ ఫస్ట్ మూవీ ‘మా నగరం’ సందీప్ కిషనే హీరో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాలో సందీప్ కిషన్ నటిస్తుండటం మరోవిశేషం. కాగా త్వరలోనే సందీప్ కిషన్ రోల్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.