తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “కూలీ” సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచే బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. రజినీ స్టైల్, లోకేష్ టేకింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన సమాచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. “కూలీ” చిత్రంలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారని టాక్. దీనికి కారణం దర్శకుడు లోకేష్ కావచ్చు. ఎందుకంటే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన “విక్రమ్” సినిమా ఘన విజయం సాధించగా, అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బాంధవ్యమే ఉంది. ఇప్పుడు అదే బంధంతో కమల్, లోకేష్ అభ్యర్థనకు వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు.
కమల్ హాసన్, రజినీకాంత్ ఒకే సినిమాలో చివరిసారిగా కలిసి నటించింది చాలా ఏళ్ల కిందట. ఇప్పుడు అయితే కమల్ డైరెక్ట్‌గా స్క్రీన్ పై కనిపించకపోయినా, ఆయన వాయిస్ మాత్రం రజినీ సినిమా మొదట్లో వినిపించబోతుందని భావనతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఈ చిత్రంలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేక్షకుల కోసం మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 14న భారీగా థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుపుతున్నారు. ఈ కలయికపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.
