‘‘మీ పార్టీ నాయకుడు- మీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ద్వారా అనేకమైన అరాచకాలకు పాల్పడ్డారు.. డిస్టిలరీలలోనే ఏజెంట్లు నియమించుకుని ప్రభుత్వానికి విక్రయించే ప్రతి కేసుకు సంబంధించి ముందే ఫిక్స్ చేసిన వాటాలను స్వాహా చేశారు.. ఆ ఏజెంట్ల ద్వారా అంచెలంచెలుగా డబ్భంతా పోగేసి… మొత్తం మీ ప్రభుత్వ పదవీకాలంలో 3 వేల కోట్ల రూపాయలకు పైగా కాజేశారు. అంతిమంగా ఆ సొమ్ము మొత్తం మీకే చేరినట్టుగా సిఐడి విచారణలో తెలుస్తున్నది’’ అనే ఆరోపణలు వినిపించినప్పుడు ఎవరైనా సరే ఏం చెబుతారు? ఎలా స్పందిస్తారు?
‘‘దమ్ముంటే ఆరోపణలను నిరూపించుకోండి.. మా ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదు.. మేము ఒక్క పైసా అవినీతికి కూడా పాల్పడలేదు.. కేవలం మద్యం ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ కావడం కోసం మాత్రమే, ప్రభుత్వం చేతిలోకి తీసుకొని దుకాణాలను నిర్వహించాము… మీకు నచ్చిన దర్యాప్తు చేయించుకోవచ్చు.. అవసరమైతే సిబిఐ దర్యాప్తు కూడా వేయించండి..’’ అని గంభీరపు ప్రకటనలు చేస్తారు. తాము అత్యంత నిజాయితీపరులం అని చాటుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేటు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర బిందువుగా ఉంటూ డిస్టిలరీల నుంచి 3000 కోట్ల రూపాయలు కాజేశారు అని ఆరోపణలు వస్తుండగా.. జగన్ ఒక విచిత్రమైన లాజిక్ చెబుతున్నారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్ సభలో వైసిపి పక్ష నాయకుడు కాగా ఆయనకు రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంతో ఏం పని ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన లాజిక్ ఏ రకంగా- ‘తాము తప్పు చేయలేదనే వాదనను తెలియజెబుతుందో’ అర్థం కావడం లేదు. అంటే ఎంపీగా ఢిల్లీలో ఉండే వివిధ పార్టీల కీలక నాయకులు.. తమ తమ స్థానిక రాష్ట్రాలలో ఎలాంటి అవినీతి కార్యకలాపాలు దుర్మార్గాలు చేయడానికి అవకాశం లేదు- అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంటున్నారా? అనేది తెలియడం లేదు
ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డికి దత్త తండ్రి వంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాంలో అత్యంత కీలక పాత్రధారిగా వందల కోట్లు కాజేసిన కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఆమె సుదీర్ఘకాలం జైలులో రిమాండ్ లో గడిపి వచ్చారు కూడా. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఢిల్లీలో ఎంపీగా ఉన్నంత మాత్రాన ఇక్కడి దందాలకు నేతృత్వం వహించే అవకాశం ఉండదా? అని ప్రజలు సందేహిస్తున్నారు. లిక్కర్ దందా జరిగిన మాట నిజమే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను విచ్చలవిడిగా పెంచడం.. ప్రభుత్వం మారిన వెంటనే అవే ధరలు మళ్ళీ తగ్గడం.. గమనిస్తేనే ప్రజలకు ఈ సంగతి అర్థం అవుతుంది! జగన్ కాజేసిన చేసిన వైనం ప్రజలకు తెలుస్తూనే ఉంది. ‘ఈ లిక్కర్ దందాలకు కేంద్ర బిందువు మిథున్ రెడ్డి కాదు’ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంటే కనుక.. ‘మరి ఇంకెవరు ఆ దందా నడిపించారో’ ఆయనే చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. ‘దందా జరగలేదు’ అంటే మాత్రం నమ్మే స్థితిలో లేమని ప్రజలు సంకేతం ఇస్తున్నారు.
మిథున్ రెడ్డిని వెనకేసుకొస్తూ జగన్ విచిత్ర లాజిక్ లు!
Sunday, March 30, 2025
