‘జగనన్న వస్తున్నాడని తెలిస్తే చాలు.. వేలకొద్దీ అభిమానులు వెల్లువలా వచ్చేస్తుంటారు’. ‘జగనన్న కోసం ఎగబడతారు’, ‘ఆయన వస్తుంటే చాలు గంటల తరబడి అయినా రోడ్ల పక్కన ఆయన కోసం నిరీక్షిస్తారు’, ‘ఆయనతో కరచాలనం చేయడం కోసం పోటెత్తుతారు’, ‘జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనం ఇది’, ‘ఏడాది పాలనతో కూటమి పట్ల ప్రజలు విసగెత్తిపోయారు.. ఎప్పుడెప్పుడు జగన్ రాజ్యం వస్తుందా అని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు’ ‘అందుకే జగన్ పర్యటనలకు జన్ వెల్లువలా వస్తున్నారు’, ‘జగన్ ఇంట్లోంచి కదిలితే చాలు జనవెల్లువే..’ వంటి రకరకాల పసలేని మాటలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం జగన్ భజన చేస్తూ ఉంటారు. అయితే వారి మాటలలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో.. బొంకులను వండి వార్చి ప్రజలను మభ్యపెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారో తాజాగారు రెండు మూడు దృష్టాంతాలను గమనిస్తే అర్థమవుతుంది.
డోన్ లో జరిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి, అలాగే భీమవరంలో తమ పార్టీ నాయకుడు ఇంట్లో శుభకార్యానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల వ్యవధిలో హాజరయ్యారు. సాధారణంగా పెళ్లిళ్లకు వచ్చే జన సందోహం, అందులో అనివార్యంగా పార్టీ కార్యకర్తలు ఉండటమే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా అని ఎగబడిన జనాలు ఎక్కడా లేరు. నిజానికి అవి వారి పార్టీ నాయకుల ఇళ్లలో శుభకార్యాలు.. అంటే ఆ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు అందరూ కచ్చితంగా పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిన కార్యక్రమాలు. అయినా సరే అంత సీన్ లేదన్నట్టుగా ఏదో నామమాత్రంగా కార్యకర్తలు రెండు చోట్లకు వచ్చారు.
మరి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనల విషయంలో ఇన్నాళ్లుగా చెప్పుకుంటున్న మాటలేమిటి? ఆయన అడుగు బయటపెడితే చాలు.. జనం వెల్లువలా వచ్చేస్తారని అంటుంటారు కదా.. ఇక్కడకు రాలేదెందుకు? అనే ఆశ్చర్యం ఎవరికైనా కలుగుతుంది. ఆయన పాపిరెడ్డిపల్లి వెళ్లినా, రెంటపాళ్ల వెళ్లినా, బంగారుపాళెం, నెల్లూరు ఎక్కడకు వెళ్లినా సరే.. జనం ఎగబడుతూ వచ్చారంటే.. దాని అర్థం అక్కడి నాయకులు ప్రత్యేకంగా తోలించారు అని! జగన్ మీదికి ఎగబడాల్సిందిగా వారందరికీ కీ ఇచ్చి పంపారని అర్థం.
నిజంగా జగన్ రాక పట్ల జనంలో అంత వెల్లువలాంటి అభిమానమే ఉంటే గనుక.. డోన్ లోగానీ, భీమవరంలోగానీ.. అంతచెప్పుకోదగ్గంతగా జనం ఎందుకు రాలేదు. ఆ ప్రాంతాల్లో ఆయనకు ఆదరణ సున్నా అని అనుకోవాలా? అనేది ప్రజల సందేహం. పై చెప్పిన యాత్రల సమయంలో పోలీసుల్ని ధిక్కరించడానికే జగన్ తన నాయకులతో జనాన్ని తోలించుకున్నారు. ప్రతి నాయకుడికీ టార్గెట్లు ఇచ్చి జనాన్ని రప్పించుకున్నారు. ఈ రెండు శుభకార్యాల్లో అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. జనాన్ని అలా తరలిస్తే అందరికీ పెళ్లిచేస్తున్న ఈ నాయకులే భోజనాలు గట్రా పెట్టాలి. వారు అందుకు సుముఖంగా లేరు. దాంతో జనాన్ని తోలించవద్దంటూ స్థానిక నాయకులకు పురమాయించారు. మొత్తంగా జగన్ పర్యనలు జరిగాయి గానీ.. జనం మాత్రం ఆయనకోసం ఎగబడడం లాంటి అతి వేషాలు జరగనేలేదు. ప్రజలకు ప్రతి విషయమూ స్పష్టంగా అర్థమవుతున్న ఇలాంటి రోజుల్లో.. తన యాత్రలకు సెక్యూరిటీ కావాలని.. జనం వెల్లువలా వస్తున్నారని నాటకాలడడం ఇకనైనా జగన్ కట్టిపెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు.
