ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏం చేయాలో, వివాదం నుంచి ఎలా బయటపడాలో తెలియని కంగారులో తప్పు మీద తప్పు చేస్తున్నదేమో అని ప్రజలకు అనుమానం కలుగుతోంది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతున్నదనే వివాదం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బెడదగా మారిపోయింది. తమ పార్టీ వారికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, కల్తీకి కారకులుగా తమ పార్టీ మీద నిందలు తగదని అనడం తప్ప.. వారు మరో రకంగా ఈ వివాదం గురించి సమర్థించుకోలేకపోతున్నారు. కల్తీ జరగలేదు.. అని చెప్పే ధైర్యం ఒక్క వైసీపీ నాయకుడికి కూడా రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ కంగారులో మరిన్ని పొరబాట్లు చేస్తున్నది.
ఇప్పటికే నెయ్యి కల్తీ గొడవ బయటపడిన తర్వాత.. పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గుతేల్చాలని కోరారు. నిజాలు నిగ్గు తేలడం అంటూ జరిగితే గనుక.. పూర్తి స్థాయి విచారణ జరిగితే గనుక.. మళ్లీ వైసీపీ పాపం మరోసారి బయటకు వస్తుందనే సంగతిని వారు ఆ హడావుడిలో మర్చిపోయినట్లున్నారు.
అదలా ఉండగా.. బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో గడుపుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు. ఆయన డిమాండ్ కూడా సేమ్ టూ సేమ్. లడ్డూ వివాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా పొరబాటు జరిగి ఉంటే విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన ప్రధానిని కోరుతున్నారు.
ఇప్పటిదాకా నిగ్గుతేల్చిన నిజాలే.. ఆ నెయ్యిలో పందికొవ్వు, గొడ్డుకొవ్వు ఉన్నదనే సంగతి. అప్పటి టీటీడీ కార్యనిర్వహణకు ప్రత్యక్షంగా బాధ్యత వహించాల్సిన జగన్మోహన్ రెడ్డి.. వాటిగురించి మాట్లాడకుండా విచారణ గురించి కోరుతున్నారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారట. అయితే ప్రధాని చొరవ తీసుకుని లోతుగా విచారణ చేయించినా కూడా వైసీపీ పాపమే బయటపడుతుంది కదా అని ఆ పార్టీ వారే భయపడుతున్నారు. మొత్తానికి కంగారులో ఎలా తమను తాము సమర్థించుకోవాలో తెలియని భయంలో పార్టీ గానీ, జగన్ గానీ వరుస తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.