ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన భారీ సినిమా ‘కుబేర’ రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా చుట్టూ భారీ బజ్ నెలకొంది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మొదట్నుంచే మంచి ఆసక్తి నెలకొంది. ఆయన గత సినిమాలకి పూర్తిగా భిన్నంగా, ఈసారి పూర్తిగా కొత్త జానర్‌కు ట్రై చేశారు. ఇక జూన్ 20న ‘కుబేర’ థియేటర్లలోకి రాబోతుండడంతో, ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు స్పెషల్ హైలైట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ధనుష్‌తో కలిసి పనిచేసిన అనుభవం పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఫీలయ్యారు. ధనుష్ టాలెంట్ చూసి ఆయన తనకు మరింతగా ఇష్టమయ్యాడని చెప్పుకున్నారు. ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.
ఈ సినిమాలో అసలు హీరో ఎవరంటే, మేమేమీ కాదు, శేఖర్ కమ్ములే అసలైన హీరో అని చెప్పారు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ కోసం శేఖర్ తన కమర్షియల్ కమ్ఫర్ట్ జోన్‌ను పూర్తిగా వదిలేసి, పూర్తిగా డిఫరెంట్ గా ఆలోచించి తెరకెక్కించారని అన్నారు. అదే విధంగా నటులైన మాకు కూడా రోజూ చేసే రొటీన్ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేలా చేశారని చెప్పుకొచ్చారు.
నాగార్జున చెప్పినట్లు, ఒకప్పుడు మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్స్ ఉన్నప్పటికీ, సినిమా అసలైన హీరో దర్శకుడు కెవి రెడ్డి అయ్యారు. అలానే కుబేరకి కూడా అసలు హీరో శేఖర్ కమ్ముల అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా ఇప్పుడు ‘కుబేర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్స్‌లోకి రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమాపై హైప్‌ను ఇంకా పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా శేఖర్ కమ్ముల కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందన్న మాట చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
