తాటిచెట్టు కింద పాలు తాగినా సరే చూసేవాళ్లకు కల్లు తాగుతున్నట్టే అనిపిస్తుంది. ఇది చాలా సహజం. అదేమాదిరిగా.. రాజకీయాల్లో కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మామూలు కలయికలకు కూడా భిన్నమైన అర్థాలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారనే ఊహాగానాలు సహేతుకంగానే పుట్టాయి. ఆయన ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్ళి భేటీ కావడం, పుష్పగుచ్ఛం ఇచ్చి ఫోటోలు దిగడం ఇందుకు కారణం. చాలా సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టింది. పార్టీ పెద్దలు ఆయనను కాంటాక్ట్ చేశారు. పర్యవసానంగా.. ఇవాళ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న ఊహాగానాలు నిరాధారం అని ఖండించారు. ఆయన ఖండించారు గానీ.. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన పార్టీ మారడం ఖాయం అనే అనుమానాలు మాత్రం తీరడం లేదు.
మేడా రఘునాథ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు బీజేపీ తమను రాష్ట్రంలో శత్రువులుగా పరిగణిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి వైసీపీ పీచమనిచే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ బద్ధ శత్రుత్వం నడుస్తున్నా కూడా.. తగుదునమ్మా అంటూ జగన్ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించడం పార్టీ వర్గాలకే మింగుడు పడడం లేదు. వారికి చాలా అవమానకరంగా ఉంది. జగన్ వెళ్లి మోడీ పాదాల వద్ద సాగిలపడుతున్నారని అందరూ విమర్శిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో మేడా రఘునాథ రెడ్డి వెళ్లి ఖర్గే ను కలవడం కీలకమే. పార్టీ నాయకులు గట్టిగా అడిగినందుకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అంతేతప్ప కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. విలేకరుల ప్రశ్నలు ఫేస్ చేయలేక.. జస్ట్ వీడియో విడుదల చేసి దులుపుకున్నట్టు తెలుస్తోంది. జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని, పార్టీ నిర్ణయం ప్రకారం ఎన్నికల్లో ఓటు వేస్తామని ఆ వీడియోలో అన్నారు. అయినప్పటికీ.. ఇవాళ కాకపోతే రేపు.. మేడా పార్టీ మారడం ఖాయం అని పలువురు విశ్లేషిస్తున్నారు.
