ఏపీలో నామినేటెడ్ పదవులకోసం నిరీక్షిస్తున్న కూటమి పార్టీల నాయకులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో ప్రస్తుతానికి పెండింగులో ఉన్న నామినేటెడ్ పోస్టులు అన్నింటినీ వారంలోగా ప్రభుత్వం భర్తీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నాయి. చాలా వరకు కీలక నామినేటెడ్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు. అయితే ఇంకా భర్తీ చేయాల్సినవి వందల వేల సంఖ్యలోనే ఉన్నాయి. చంద్రబాబునాయుడు, పార్టీ కీలక నేతలు వీటి భర్తీ విషయంలో సుదీర్ఘకాలంగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. జనసేన, భాజపా కూడా చాలా కాలం కిందటే.. ప్రతి నామినేటెడ్ వ్యవస్థలకు తమ వంతుగా పేర్లను ఆల్రెడీ సూచించేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తుది కసరత్తును పూర్తిచేసి, వారంలోగా అన్ని పదవులను భర్తీ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి.
తాజాగా 11 కార్పొరేషన్లకు 120 మంది డైరక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. ఇంకా అనేక కార్పొరేషన్ల పదవులున్నాయి. దేవాలయాల కమిటీలు ఉన్నాయి. ప్రధానంగా దేవాలయాల కమిటీల్లో స్థానం కోసం సుదీర్ఘకాలంగా కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. వందకు పైగా ఆలయాలకు ఇంకా బోర్డులను నియమించాల్సి ఉంది. టిటిడి తప్ప ఏ ప్రధాన ఆలయానికి బోర్డుల ప్రకటన ఇప్పటిదాకా జరగనేలేదు. చంద్రబాబునాయుడు చాలా సందర్భాల్లో నామినేటెడ్ పోస్టులను సత్వరం భర్తీ చేయడం గురించి చెబుతూ వచ్చారు. స్థానికంగా అర్హులైన కార్యకర్తల పేర్లను ఎమ్మెల్యేలు సకాలంలో సూచించకపోవడం వల్లనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యం అవుతున్నదని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు కూటమి పార్టీలు తమ జాబితాలు కూడా ఇచ్చేసిన తర్వాత.. పార్టీ వర్గాలు ఎమ్మెల్యేలందరితో మాట్లాడి తెప్పించినట్టుగా తెలుస్తోంది.
ఆ జాబితాలను వడపోసి.. నామినేటెడ్ పోస్టుల ప్రకటన త్వరలోనే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆశావహులందరూ పార్టీ పెద్దల చుట్టూ తిరగడం అవుతోందే తప్ప.. ఇన్నాళ్లుగా నియామకాలు జరగడం లేదు. ప్రధానంగా ఆలయ కమిటీల పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది. ఇప్పటికైనా నియామకాలు జరిగితే ఈ ప్రభుత్వకాలంలో రెండు సార్లు బోర్డుల నియామకం ఉంటుందని.. ఇకనైనా ఆలస్యం జరగకుండా.. ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నట్టుగా వారంలోగా అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తిచేస్తే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు.
