వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో కాలనాగులాగా విషం కక్కారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందకుండా సర్వనాశనం చేయాలనుకున్నారు. 70 శాతం పూర్తయిన నిర్మాణాల్ని కూడా పట్టించుకోకుండా, మౌలికవసతుల పరంగా సగంలో ఉన్న పనులను పూర్తిచేయకుండా అమరావతి ప్రాంతం మొత్తం స్మశానంలాగా మారిపోవడానికి ఆయన తన వంతు కృషి చేశారు. మూడు రాజధానులు అనే మూడుముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని రాజధానికి గతిలేని అనాథరాష్ట్రంగా మార్చేశారు. కేవలం అమరావతి రాజధాని పూర్తయితే.. దానికి సంబంధించి క్రెడిట్ మొత్తం చంద్రబాబునాయుడుకు మాత్రమే దక్కుతుందనే ఏకైక కుట్ర ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారనేది అందరికీ తెలుసు. అయితే ఆయన కుట్రఆలోచనల తాలూకు ఫలితం కొన్ని వేల కోట్ల రూపాయలుగా రాష్ట్ర ఖజానా మీద భారంగా మారుతోంది.
అమరావతి రాజధానిని శరవేగంగా పనులు చేపట్టి.. మూడేళ్లలోగా ఒక రూపు తీసుకురావడానికి అన్ని రకాల ప్రభుత్వ భవనాలను దాదాపుగా పూర్తి చేయడానికి చంద్రబాబునాయుడు సర్కారు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11,467 కోట్లకు సంబంధించిన పనులపై జీవోలు కూడా విడుదల అయ్యాయి. కాలపరిమితి ముగియడంతో గత చంద్రబాబు ప్రభుత్వంలో పిలిచిన టెండర్లన్నీ రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలుస్తున్నారు. అనేక పనులకు వివిధ సంస్థలు ఇప్పటికే దక్కించుకున్నాయి కూడా. ఐకానిక్ భవనాలకు కొత్తడిజైన్లు కూడా సిద్ధం అవుతున్నాయి. వాటిని కూడా నార్మన్ ఫోస్టర్స్ సంస్థే రూపొందిస్తోంది.
అయితే అయిదేళ్ల పాటు అమరావతికి పట్టిన జగన్ గ్రహణం ఎఫెక్ట్ ఇప్పుడు సాగుతున్న పునర్నిర్మాణ పనులపై దారుణంగా పడుతోంది. జగన్ అయిదేళ్లలో ఒక్క ఇటుక పెట్టే పని కూడా చేయకపోవడం వలన.. సగం పూర్తయిన నిర్మాణాలను ఇప్పుడు పూర్తి చేయడానికే దాదాపు 45 శాతం వ్యయం అదనంగా పెరుగుతున్నట్టుగా అంచనాలు చెబుతున్నాయి. సీఆర్డీయే అధికార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు పనులకు చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపిన నేపథ్యంలో జగన్ కారణంగా పనులపై పెరిగిన భారం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ పెరిగిన భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ పనులు పూర్తిచేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. హాపీ నెస్ట్ అపార్టుమెంట్ల సముదాయంలో గతంలోనే విక్రయాలు పూర్తిచేశారు. ఇప్పుడు వాటి భారం కూడా దాదాపు 200 కోట్లు పెరుగుతోంది. అయితే లబ్ధిదారులపై ఆ భారం మోపకుండా.. వాటిని పూర్తిచేసి ఇవ్వాలని బాబు సూచించారు. జగన్ గ్రహణం రాష్ట్రానికి, ప్రత్యేకించి అమరావతికి వదలిపోయింది గానీ.. ఆ పీడ ప్రభావం మాత్రం ఇంకా ఉన్నదని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ గ్రహణం తొలగించి గానీ.. అమరావతికి భారమే!
Thursday, January 16, 2025