‘నేను మద్యం అమ్మలేదు, మద్యం తాగలేదు..’ ఈ మాటలు చెప్పడం వల్లప్రయోజనం ఏమిటి? చెవిరెడ్డి భాస్కర రెడ్డి లిక్కరు తాగినందుకు సిట్ పోలీసులు నమోదు చేసిన కేసు కాదు కదా యిది. మరి ఆయన మీడియా కెమెరాలు కనపడగానే.. ఆ మాటలు చెప్పడం వల్ల ఏం కోరుకుంటున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
దేవుడి మీద ప్రమాణం అని ఒక రంకె వేయడం.. ఆ తర్వాత.. అర్థసత్యాలు, డొంకతిరుగుడు సత్యాలు మాట్లాడడం చెవిరెడ్డి టెక్నిక్ గా మారింది. దేవుడి మీద ప్రమాణం అనగానే.. చూస్తున్న వాళ్లంతా అయ్యో .. దైవభక్తి ఉన్నవాడు కదా.. పాపం నిజమే చెబుతున్నాడేమో అని అనుకోవచ్చు. కానీ.. ఆ ప్రమాణాల ద్వారా చెవిరెడ్డి చెబుతున్నదేంటి? ‘నేను మద్యం తాగలేదు, నేను మద్యం అమ్మలేదు’ అని మాత్రమే కదా. ఆయన నిజంగానే మద్యం తాగే అలవాటు లేని సచ్ఛీలుడు అయి ఉండవచ్చు.
కానీ.. ఇక్కడ నమోదు అయిన కుంభకోణం కేసు లిక్కరు తాగే మందుబాబుల గురించి కాదు. అలాగే లిక్కరు అమ్మే వ్యాపారుల గురించి కూడా కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్కరూ లిక్కరు అమ్మలేదు కద. లిక్కరు సమస్తం ప్రభుత్వం మాత్రమే కదా అమ్మింది. చెవిరెడ్డి మాత్రమే కాదు కదా.. లిక్కరు కుంభకోణంలో నిందితులుగా 42 మందిలో ఏ ఒక్కరు కూడా లిక్కరు అమ్ముకున్న బాపతు కాదు. కాకపోతే.. లిక్కరు పాలసీ అనే ఒక మాయా పూరిత విధానం ద్వారా.. ప్రజాధనాన్ని వేల కోట్లుగా కొల్లగొట్టిన వారు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి.
ఈ కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఏమిటినేది పోలీసులు చాలా స్పష్టంగా తేల్చారు. చెవిరెడ్డి డిస్టిలరీలను బెదిరించినట్టుగానీ, వారినుంచి సొమ్ము వసూలు చేైసి తీసుకువచ్చినట్టుగానీ పోలీసులు అనడం లేదు. రాజ్ కెసిరెడ్డి నెట్వర్క్ మొత్తం కలిపి డంప్ లలో నిల్వ చేసిన వందల వేల కోట్ల రూపాయలను చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తన అనుచరులు వెంకటేశ్ నాయుడు తదితరులతో కలిసి ఎన్నికల అవసరాలకు తరలించాడనేది ప్రధాన అభియోగం. చీటికీమాటికీ దేవుడి మీద ప్రమాణం చేసే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. ఆ ప్రమాణంతో.. జగన్ కుగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం ఉన్న నగదును ఎన్నికల అవసరాలకు తరలించడంలో నా పాత్రలేదు.. అని చెప్పడం మాత్రం జరగదు. అందుకే.. చెవిరెడ్డి రంకెలు వేస్తూ డొంకతిరుగుడు బుకాయింపులు ఎన్ని చేసినప్పటికీ.. ప్రయోజనం లేదని ప్రజలు అంటున్నారు.
