చార్జిషీట్ 2: బిగ్ బాస్ కు సొమ్ములు చేరినది ఎలాగంటే..?

Monday, December 8, 2025

మూడున్నర వేల కోట్ల రూపాయలను దిగమింగిన పాపం తాలూకు లెక్కలు తేల్చడం, నిందితుల అరాచకాలను నిగ్గుతేల్చడం ఒక పట్టాన సిట్ పోలీసులకు సాధ్యమయ్యే వ్యవహారంలా కనిపించడం లేదు. తుది చార్జిషీటు అప్పుడే కాదని వారు తేల్చేశారు. ఇంకా చాలా విచారణ సాగితే తప్ప.. అసలు పాపాల భైరవులు తేలరని వారు పేర్కొంటున్నారు. అందుకే.. సోమవారం నాడు లిక్కర్ స్కామ్ లో అదనపు చార్జిషీట్ మాత్రమే దాఖలు చేశారు. ఇంకా విచారణ చేయాల్సి ఉన్నదని కోర్టుకు నివేదించారు. ఈ రెండో చార్జిషీటు కూడా ఏకంగా రెండువందల పేజీలు ఉంది.

అయితే ఈ రెండో చార్జిషీట్ లో అనేక కీలక అంశాల ప్రస్తావన ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ రెండో చార్జిషీటు పూర్తిగా అంతిమలబ్ధిదారుకు వసూలు చేసిన సొమ్ములు ఎలా చేరాయి? వాటికి సంబంధించిన ఆధారాలేమిటి? అనేదే ప్రధానంగా సాగినట్టు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో ఆలస్యంగా జత చేరిన కీలక నిందితులు ముగ్గురు ఉన్నారు. వారే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ! జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు, విశ్వసనీయులు అయిన తొలి ఇద్దరు, వైఎస్ భారతి వ్యాపారాల్లోని ఆర్థిక లావాదేవీలు అన్నీ స్వయంగా తానే చక్కబెడుతూ వచ్చిన గోవిందప్ప బాలాజీ లు.. నెట్ వర్క్ భాగస్వాములు వారి వాటాలను కట్ చేసుకోగా, ఇద్దరు ఎంపీలకు నెలనెలా ఇవ్వవలసిన అయిదు కోట్ల రూపాయల వాటాలను చెల్లించగా.. ఇతర అవసరాలు, దాచిపెట్టడాలు పోగా, మిగిలిన వందల కోట్ల రూపాయలను పూర్తిగా వీరే అంతిమ లబ్ధిదారుకు చేర్చారనేది సమాచారం.

అప్పటి సీఎంఓ లో ముఖ్యమంత్రి కంటె కీలకమైన వ్యక్తులుగా హవా చెలాయించిన వ్యక్తులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. అలాగే వైఎస్ భారతీ కోటరీలోని ముఖ్యభూమిక గోవిందప్ప బాలాజీది. వీరు రాజ్ కెసిరెడ్డి వసూలు చేసి నగదును దాచిన డంప్ ల వద్దకు స్వయంగా తమ అధికారిక ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి.. ఆ వాహనాల్లోనే నగదు బాక్సులను పెట్టించుకుని.. వాటిని తీసుకువెళ్లి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్టుగా గతంలోనే సిట్ విచారణలో తేలింది. ఈ ముగ్గురూ బిగ్ బాస్ గా అందరూ వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి వసూళ్ల సొత్తును చేర్చిన విధానం ఎటువంటిదో ఈ రెండో చార్జిషీట్ లో ప్రధానంగా చెప్పారని సమాచారం.

కాగా, మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో గతనెల 19న అధికారులు ప్రాథమిక చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. ఇప్పుడు సమర్పించినది అనుబంధ చార్జిషీట్ మాత్రమే. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అంతా పూర్తయిన తర్వాత.. మరొక అనుబంధ చార్జిషీటు కూడా దాఖలు చేస్తాం అని సిట్ అధికారులు కోర్టుకు నివేదించినట్టు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles