మరో కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారుతున్నాడు. ఎన్నో తెలుగు సినిమాలలో ఎందరో అగ్ర నటుల పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు. తెలుగు పరిశ్రమలో ఎంతో బిజీగా వుండే కొరియోగ్రాఫర్ లలో గణేష్ మాస్టర్ ఒకరు. అటువంటి గణేష్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా ఓ కొత్త నటుడిని తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నాడు.
ఆ నటుడు వేరెవరో కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సమీప బంధువు, విరాట్ రాజ్. బుధవారం అతిరధ మహారధులు హాజరై గణేష్ మాస్టర్ కి తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలిపారు. వారిలో అగ్ర దర్శకుడు సుకుమార్, ఇంకో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. అలాగే చిత్ర పరిశ్రమ నుండి కూడా ఎంతోమంది గణేష్ మాస్టర్ కి, విరాట్ కి తమ శుభాకాంక్షలని తెలిపారు.
గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎక్కువగా పని చేశారు. ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ ‘వకీల్ సాబ్’, ‘ గోపాల గోపాల’ సినిమాలకి అలాగే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ, నాగార్జున, నితిన్, బెల్లంకొండ, ఇలా చాలామంది హీరోలకు గణేష్ మాస్టర్ తన ఆటను ఇచ్చారు
తాజాగా విరాట్ ని పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాకి టైటిల్ ని కూడా ‘గౌడ్ సాబ్’ అని ఖరారు చేశారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ అని చిత్ర బృందం తెలిపింది. బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతామని తెలియజేశారు. అయితే కథానాయిక పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది, అలాగే మిగతా నటీనటుల ఎంపిక కూడా జరగాల్సి ఉంది. కొంతమంది సాంకేతిక నిపుణలను ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలిసింది. విరాట్, ప్రభాస్ కి వరసకి తమ్ముడు అవుతాడని అంటున్నారు.