తెలుగు ప్రేక్షకుల్లో పార్వతి–దేవదాసుల కథలకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. అదే భావాన్ని ఈ తరం రుచికి తగ్గట్టు చూపించేందుకు “ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు” అనే పేరుతో ఓ కొత్త సినిమా తయారవుతోంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ సంస్థలో తోట రామకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.
సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో ఇద్దరు యువకులు, ఒక అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. హాస్యం, భావోద్వేగాలు కలిపి, యువతను ఆకట్టుకునే విధంగా సినిమాను తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు చెబుతున్నారు.
సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత వంటి పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సంగీతాన్ని మోహిత్ రహమానియాక్ అందించగా, పాటలకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్రబోస్‌తో పాటు సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. సినిమా ట్రైలర్, విడుదల తేదీకి సంబంధించిన సమాచారం త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
