సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన “కూలీ” సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, ప్రమోషన్ల వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేస్తుందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు నమ్మారు. కొంతమంది అయితే ఇది వెయ్యి కోట్ల వరకు వెళ్లొచ్చని కూడా చెప్పుకున్నారు.
కానీ విడుదలైన తర్వాత పరిస్థితి కొంత భిన్నంగా మారింది. మొదటి వీకెండ్‌కి ప్రేక్షకులు థియేటర్స్‌కి పెద్ద ఎత్తున వచ్చి కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి వసూళ్లు క్రమంగా తగ్గిపోవడంతో సినిమా ఆశించిన రేంజ్‌లో దూసుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు ఐదు వందల కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేదు.
ఈ ఫలితానికి ప్రధాన కారణం కథలో ప్రత్యేకత లేకపోవడమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
