టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన “మిరాయ్”లో అందరికీ ప్రత్యేక ఆకర్షణగా మారింది రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్. సినిమా మొదటినుంచి చివర వరకు పురాణాలు, ఇతిహాసాల వైభవాన్ని ఆయన స్వరంతో వినిపించడం ప్రేక్షకులకు మరో లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా ఆయన చెప్పిన తీరు ఎంతో బలంగా, అద్భుతంగా అనిపించిందని చెబుతున్నారు. కొంతమంది అయితే ప్రభాస్ తన స్వంత సినిమాల్లో చెప్పిన డబ్బింగ్ కంటే, ఈ వాయిస్ ఓవర్ మరింత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నారు.
సాధారణంగా ప్రభాస్ మాటలు కొంచెం నెమ్మదిగా, విరామాలతో ఉంటాయని అందరికీ తెలుసు. కానీ “మిరాయ్”లో వినిపించిన వాయిస్ ఓవర్ మాత్రం వేగంగా ఉండటంతో, ఇది నిజంగానే ప్రభాస్ గొంతేనా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. అక్కడి చర్చల్లో ఏఐ టెక్నాలజీతో వాయిస్‌ని తయారు చేశారని కూడా ప్రచారం పెరిగింది.
ఈ ఊహాగానాలపై చివరికి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ స్వయంగా వాయిస్ ఓవర్ చెప్పాడని, సినిమాలో వినిపించిన ప్రతి డైలాగ్ ఆయన గొంతు నుంచే వచ్చిందని తెలిపారు. కానీ వాయిస్‌లో కొంత వేగం పెంచడానికి టెక్నాలజీ సహాయం తీసుకున్నామని, దీని వెనుక కారణం రన్‌టైమ్‌ను తగ్గించడమేనని చెప్పారు. దీంతో ఏఐ వాడారనే రూమర్స్‌కి పూర్తిగా బ్రేక్ పడింది.
