సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాల్లో భారీగా నిరాశ కలిగించిన చిత్రాల్లో “లాల్ సలాం” కూడా ఒకటి. జైలర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత, రజినీ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రజినీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు. కొంతమంది ప్రేక్షకులు అసలు సినిమా చూసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే సంవత్సరం గడిచింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఫుటేజ్ మిస్ అయ్యిందని వివాదం కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అది తిరిగి లభించాకే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓటీటీలో విడుదల చేయగలిగారు.
తాజాగా “లాల్ సలాం” సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం కేవలం తమిళ్ భాషలోనే అందుబాటులో ఉంది. రజినీ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి ఉంటే, ఇప్పుడు సన్ నెక్స్ట్‌లో చూడవచ్చు. సినిమా కథ అంతగా ఆకట్టుకోకపోయినా, ఆయన అభిమానం వల్ల కొంతమంది మాత్రం ఓసారి ప్రయత్నించొచ్చు.
