రాజకీయ ఉనికి కోసం రెచ్చగొడుతున్న ముద్రగడ!

Saturday, January 18, 2025

`దమ్ముంటే నా మీద పోటీచేయి… పీఠాపురమా ? కాకినాడా?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత తాజాగా రాసిన లేఖ చూస్తుంటే తన రాజకీయ ఉనికి కోసం పవన్ ను, ఆయన మద్దతుదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 

కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వెన్కవేసుకొస్తూ, బహిరంగసభలలో మాట్లాడే భాష మార్చుకొమ్మంటూ పవన్ కు ఆయన సలహా ఇస్తూ వ్రాసిన మొదటి లేఖకు జనసేన అధినేత జవాబు ఇవ్వక పోవడంతో నిరుత్సాహానికి గురయిన్నట్లున్నారు. 

అయితే ఆయన మొదటి లేఖ కాపు నేతలలోనే ఆగ్రవేశాలు కలిగించడంతో `అభిమానులతో బండ బూతులు పెట్టిస్తే.. లొంగిపోతానా? సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కాదు .. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదు’ అంటూ పొంతనలేని మాటలతో రెండు లేఖ వ్రాసారు. 

“నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది? నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా! అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?”’ అని ముద్రగడ ఆ లేఖలో ప్రశ్నించడం గమనిస్తే ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు స్పష్టం అవుతుంది. 

 “కాకినాడ.. లేదంటే పిఠాపురం.. నాపై పోటీకి రెడీనా ? ఎన్నికల బరిలో ఉండాలా.. లేదా అనుకుంటున్న సమయంలో మీరు, జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందనే సంగతి మరువవద్దు.” అని రాశారు.. 

అంట పవన్ కళ్యాణ్ ను, జనసైనికులను రెచ్చగొట్టడం ద్వారా సీఎం జగన్ దృష్టిని ఆకట్టుకొని తనకు తప్పకుండా సీట్ ఇచ్చేటట్లు చేసుకోవడమే ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. లేదా జగన్ తో కుమ్మక్కయ్యారని అపవాదు రాకుండా,  జనసైనికులు సవాల్ చేసే పోటీచేస్తున్నానంటూ సర్దిచెప్పుకొనే ఎత్తుగడగా కనిపిస్తున్నది. 

పవన్ కళ్యాణ్ `వారాహి విజయ యాత్ర’కు లభిస్తున్న మద్దతు చూస్తుంటే అధికార పక్షంలో ఖంగారు బయలుదేరింది. ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదురైతే వచ్చే ఎన్నికలలో తీవ్ర పరాభావం తప్పదనే భయం పట్టుకుంది. అందుకనే ముద్రగడను ప్రయోగించడం ద్వారా పవన్ కళ్యాణ్ మద్దహతుదారులలో కొందరిని తమవైపుకు తిప్పుకోవచ్చని ఎత్తుగడ  వేశారు. 

తనకో లేదా తన కుమారుడికో వచ్చే  ఎన్నికలలో వైసిపి సీట్ కోసం ఎదురు చూస్తున్న ముద్రగడ ఇదే అవకాశం అనుకోని తన సహజ ధోరణిలో విజృంభిస్తూ పవన్ కళ్యాణ్ కు బహిరంగలేఖ వ్రాసారు. అయితే ఆ లేఖ పట్ల పవన్ మౌనం వహించడంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు.  మరోవంక, కాపు నేతల నుండి ముద్రగడ జగన్ మెప్పు కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు చెలరేగడంతో ఆందోళనకు గురయినట్లు ఆయన రెండో లేఖ వెల్లడి  చేస్తుంది.  

దానితో గతంలో  వంగవీటి రంగా, తర్వాత తాను నిర్వహించిన కాపు సదస్సులపై నాటి ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు ప్రస్తావిస్తూ అప్పుడు నీవెక్కడ ఉన్నావు? అంటూ పవన్ ను ప్రశ్నించడం ప్రారంభించారు. 

బహుశా పవన్ కళ్యాణ్ అప్పుడు యువకుడిగా ఉండి ఉండవచ్చు. అప్పుడు రాలేదే? అంటూ దశాబ్దాల తర్వాత ఇప్పుడు అడగడం గమనిస్తే పాత సంఘటనలు గుర్తుకు తెచ్చి కాపు యువతను రెచ్చగొట్టే ఎత్తుగడగా కనిపిస్తుంది.  ఏదో విధంగా ఒక అలజడి సృష్టిస్తే, పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి దూషణలకు దిగితే రాజకీయంగా తన అస్తిత్వం బయటపడుతుందనే ఆదుర్దా ఆయనలో కనిపిస్తుంది. 

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేతగా, వైసిపి ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజాక్షేత్రంలో నిలదీయడం ద్వారా 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతును సమీకరించు కొనేందుకు ఈ యాత్ర చేస్తున్నారు. ఆయన యాత్రపై, ఆయన ఆరోపణలపై అభ్యంతరాలుంటే వైసీపీ నేతలకు ఉండాలి. వారు స్పందించడం, ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం సహజమే. 

కానీ, ముద్రగడకు ఎందుకు కోపం వస్తుంది ? ఆయన వైసీపీ నేతగా బహిరంగ లేఖల ద్వారా పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారా? లేదా ఆయనను నిలదీయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ మెప్పు పొందే  ప్రయత్నం చేస్తున్నారా? ఆ స్పష్టత ఆయన లేఖలలో కనిపించడం లేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles